బెంగాల్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోంది.. సీఎం మమత ఆరోపణలు
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:54 AM
పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ రెండో విడత పోలింగ్ జరుగుతోంది. 142 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
కోల్‌కతా, ఏప్రిల్ 29: పశ్చిమ బెంగాల్‌లో ఇవాళ(బుధవారం) రెండో విడత పోలింగ్ జరుగుతోంది. 142 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఇదే సమయంలో టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందంటూ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
భవానీపుర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పోలింగ్ తీరును పరిశీలించేందుకు మమతాబెనర్జీ తాను పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గానికి వెళ్లారు. ఇక్కడే పోటీ చేస్తోన్న బీజేపీ నేత సువేందు అధికారి కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మమతను ఉద్దేశించి..‘ ఆమెకు ఈ రోజు ఎవరూ ఓటేయరు’ అని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ, ఎన్నికల సంఘంపై సీఎం మమత విమర్శలు చేశారు.
కేంద్ర బలగాలకు చెందిన సభ్యులు టీఎంసీ పార్టీ కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి, ఓటర్లను భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోందని, ఎన్నికల సంఘం పరిశీలకులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారంటూ దీదీ సంచలన ఆరోపణలు చేశారు. తృణమూల్ కార్యకర్తను రాత్రి ఎలా కొట్టారో చూడండి. ఇదేం గూండాయిజం..? ఓటింగ్ ఇలా జరగకూడదని ఆమె విమర్శించారు.
ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండగని, కానీ వారు పండగ స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారంటూ బీజేపీ, ఈసీలపై మమత తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, ఆమె గూండాలను వెంటేసుకొని తిరుగుతూ ఓటర్లను భయపెడుతున్నారని సువేందు కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఎన్నికల పరిశీలకుల ప్రవర్తనపై టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని, రాజకీయ ఒత్తిడికి లోనై వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి..