మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీకి ప్రమోషన్
ABN , Publish Date - Oct 05 , 2026 | 09:21 PM
ఢిల్లీ ఏసీపీతో సహా కొందరు పోలీసులు తమను లైంగికంగా వేధించారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈరోజు ఆ ఏసీపీ ప్రమోట్ అయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో మహిళా జర్నలిస్టులను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఏసీపీ వివేక్ భగత్ ప్రమోషన్ పొందారు. ఆయనను అదనపు డీసీపీగా ప్రమోట్ చేస్తూ ఉన్నతాధికారులు ఈరోజు (సోమవారం) ఆదేశాలు జారీ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ శనివారం దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు పోలీసులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘నిరసన చేస్తున్న మహిళలను అడ్డుకోవడానికి పోలీసులు వచ్చారు. అయితే వారిలో మహిళా పోలీసులు ఒకరు కూడా లేరు. దీనిపై నేను ఏసీపీ వివేక్‌ను ప్రశ్నించాను. బదులుగా ఆయన నాపై లైంగిక దాడి చేశారు’ అని ఓ మహిళ ఆరోపించారు.
ఈ సమయంలో వివేక్ భగత్‌కు ప్రమోషన్ రావడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ మండిపడుతోంది. ‘వేధించినందుకు బహుమతి ఇచ్చారా..?’ అంటూ ఆ పార్టీ ఎక్స్ వేదికగా ఘాటుగా ప్రశ్నించింది. అయితే ఈ వివాదంపై ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందించారు. ఆ ప్రమోషన్ ఆదేశాలు ఇప్పుడు ఇచ్చినవి కావని, కొన్ని నెలల క్రితమే అవి ఇచ్చారని ఆయన చెప్పారు.
ఈ వార్తలూ చదవండి
మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల లైంగిక వేధింపులు!
జ్ఞానేశ్‌కుమార్‌కు కొత్త తలనొప్పి!