Share News

మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల లైంగిక వేధింపులు!

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:16 AM

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం పలు సంఘాలు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న సమయంలో..

మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల లైంగిక వేధింపులు!

  • జంతర్‌మంతర్‌ వద్ద ఘటన

  • ముగ్గురు మహిళా జర్నలిస్టుల ఆరోపణ

  • ఏసీపీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి

  • పోలీసుల తిరస్కరణ.. జర్నలిస్టుల నిరసన

న్యూఢిల్లీ, అక్టోబరు 4: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం పలు సంఘాలు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న సమయంలో రిపోర్టింగ్‌ చేయటానికి వెళ్లిన తమపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. ముఖ్యంగా ఏసీపీ వివేక్‌ భగత్‌ తనను అనుచితంగా తాకుతూ తోసివేశాడని ఒక జర్నలిస్టు ఆరోపించారు. మహిళా నిరసనకారులను పురుష పోలీసులు అరెస్టు చేయటాన్ని ప్రశ్నించినందుకు ఆయన తనతో దురుసుగా ప్రవర్తించి అనుచితంగా తాకారని తెలిపారు. తమపై వేధింపులకు పాల్పడిన పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పార్లమెంటు స్ట్రీట్‌ పోలీస్ స్టేషన్‌లో వారు ఆదివారం ఫిర్యాదు చేశారు. కాక్రోచ్‌ జనతాపార్టీ (సీజేపీ), ఏఐఎస్ఎఫ్‌ విద్యార్థి సంఘం కూడా ఇలాంటి ఆరోపణలే చేశాయి. జర్నలిస్టులతోపాటు మహిళా న్యాయవాదులు, ఉద్యమకారులతో కూడా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించాయి. అయితే, ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు పోలీసులు నిరాకరించారు. దీంతో, బాధితులతోపాటు వందలమంది జర్నలిస్టులు పోలీస్ స్టేషన్‌ ముందు దాదాపు మూడు గంటలపాటు ధర్నా నిర్వహించారు. వారికి సీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా తోడవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జర్నలిస్టులతోపాటు సీజేపీ, ఇతర ప్రజాసంఘాల నిరసనతో పోలీసులు దిగివచ్చారు. ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదులను క్రైమ్‌బ్రాంచ్‌కి బదిలీ చేశామని ఎక్స్‌లో తెలిపారు.


నిరసనల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ గుర్తు తెలియని వ్యక్తులపై మూడు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లు కూడా మరో ప్రకటనలో పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, పోలీసుల అనుచిత ప్రవర్తనకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ మండిపడ్డారు.

Updated Date - Oct 05 , 2026 | 05:58 AM