Share News

జ్ఞానేశ్‌కుమార్‌కు కొత్త తలనొప్పి!

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:19 AM

చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై 20 ఏళ్లనాటి అవినీతి ఆరోపణలు, ఓ సివిల్‌ ఇంజనీర్‌ ఆత్మహత్యకు సంబందించిన కేసును కేరళ ప్రభుత్వం తిరగతోడుతోంది.

జ్ఞానేశ్‌కుమార్‌కు కొత్త తలనొప్పి!

  • సీఈసీపై 20 ఏళ్ల నాటి కేసును తిరగదోడుతున్న కేరళం ప్రభుత్వం

తిరువనంతపురం, 4: చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై 20 ఏళ్లనాటి అవినీతి ఆరోపణలు, ఓ సివిల్‌ ఇంజనీర్‌ ఆత్మహత్యకు సంబందించిన కేసును కేరళ ప్రభుత్వం తిరగతోడుతోంది. కేరళ హోంశాఖ మంత్రి రమేశ్‌ చెన్నితల పేర్కొన్న వివరాల ప్రకారం 2006లో కేరళలో జ్ఞానేశ్‌ ప్రజా పనుల విభాగం (పీడబ్ల్యూడీ) కార్యదర్శిగా సేవలందించారు. అప్పట్లో కేరళ రాష్ట్ర రవాణా ప్రాజెక్టు (కేఎ్‌సటీపీ) కింద రూ.215 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో అంగమలి నుంచి తిరువనంతపురం దాకా రోడ్డు పునర్‌నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కాంట్రాక్టును పీఏటీఐ-బీఈఎల్‌ అనే ఇండో మలేసియా జాయింట్‌ వెంచర్‌ సంస్థ దక్కించుకుంది. ఈ పనులకు సంబంధించి బిల్లులు క్లియర్‌ చేసేందుకు లంచాలు అడుగుతున్నారని ఆరోపిస్తూ ఆ ప్రాజెక్టు చీఫ్‌ మేనేజర్‌గా వ్యవహరించిన లీసీ బీన్‌ అనే మలేసియా సివిల్‌ ఇంజనీర్‌ కౌలాలంపూర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యను, ప్రాజెక్టు కంపెనీ మేనేజర్‌ను ఉద్దేశించి రెండు సూసైడ్‌ నోట్‌లను రాసిన ఆయన.. వాటిల్లో ఆయన అప్పటి కేరళ పీడబ్ల్యూడీ కార్యదర్శిగా ఉన్న జ్ఞానేశ్‌ కుమార్‌ పేరును ప్రధానంగా ప్రస్తావించారు. అచ్యుతరామన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జ్ఞానేశ్‌ కుమార్‌పై ఉన్న కేసును అటకెక్కించిందని రమేశ్‌ చెన్నితల ఆరోపించారు. తాజాగా కాంగ్రెస్‌ నేత ఎం. వేణుగోపాల్‌ ఫిర్యాదు ఆధారంగా రమేశ్‌ చెన్నితల ఈ కేసును విజిలెన్స్‌ ఏసీబీకి అప్పగించారు. జ్ఞానేశ్‌ ప్రస్తుతం సీఈసీగా ఉన్నా ఈ కేసులో న్యాయపరమైన అడ్డంకులు ఉండబోవని రమేశ్‌ చెన్నితల అన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 05:20 AM