తమిళనాట టీవీకే విజయ్ ఘన విజయం.. వెల్లువెత్తుతున్న అభినందనలు
ABN , Publish Date - May 05 , 2026 | 12:22 PM
రాజకీయ రంగప్రవేశంతోనే అద్భుత విజయం సాధించి.. తమిళ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే విజయ్‌కి ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్, రామ్ చరణ్ వంటివారు ఆయనకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్‌కి ప్రముఖుల నుంచి అభినందనల వెల్లువ కొనసాగుతోంది. రజనీకాంత్, కమల్ హాసన్, రామ్ చరణ్ తేజ్, రష్మిక మందన్న వంటి సెలబ్రిటీలు ఆయన విజయాన్ని కొనియాడుతూ శుభాకాంక్షలు తెలిపారు. 'ఇటీవల ముగిసిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఘన విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు తిరు విజయ్‌కి, ఆయన పార్టీ సభ్యులకు నా అభినందనలు' అని రజనీకాంత్ ఎక్స్ వేదికగా టీవీకే విజయ్‌కి అభినందనలు తెలిపారు.
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ స్పందిస్తూ.. 'తమ తొలి ఎన్నికల్లోనే ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని, గొప్ప విజయాన్ని సాధించిన విజేత.. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్. ఆయనకు, పార్టీ సభ్యులకు నా అభినందనలు. వారి ప్రజాసేవ వర్ధిల్లాలని కోరుకుంటున్నాను' అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన విజయ్‌కి హృదయపూర్వక అభినందనలు. మీ దార్శనికత, జనంతో మీకున్న అనుబంధం నిజంగా ఆకట్టుకున్నాయి. తమిళనాడును నిరంతర ప్రగతి పథంలో నడిపించడంలో మీరు గొప్ప విజయం సాధించాలని కాంక్షిస్తున్నాను' అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
విజయ్ గెలుపుపై నటి రష్మిక మందన్న హర్షం వ్యక్తం చేస్తూ 'అభినందనలు విజయ్ సర్! మీ విజయం పట్ల చాలా ఆనందంగా ఉంది. ఈ కొత్త శకంలో మిమ్మల్ని చూడటం ఎంతో ఉత్సాహంగా ఉంది! మీకు ఆల్ ది వెరీ బెస్ట్ సర్!' అని పోస్ట్ చేశారు.
నటుడు ధనుశ్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 'తాము బరిలోకి దిగిన మొట్టమొదటి ఎన్నికలలోనే.. తమిళనాడు ప్రజల అపారమైన మద్దతు, ప్రేమను సంపాదించుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న విజయ్‌కి, తమిళనాడు విక్టరీ కళగానికి నా హృదయపూర్వక అభినందనలు' అని అన్నారు.
వీరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్, తెలుగు ప్రముఖ నటులు చిరంజీవి, వెంకటేశ్ దగ్గుబాటి, కాజల్ అగర్వాల్, అనిరుధ్ రవిచందర్, సిలంబరసన్.టీఆర్, కార్తీ, మహేశ్ బాబు కూడా విజయ్‌కి అభినందనలు తెలిపారు. ఇది దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ఆయనకు లభించిన విస్తృత మద్దతును ప్రతిబింబిస్తోంది.
కాగా.. అద్భుతమైన రాజకీయ రంగప్రవేశంలో 'తమిళగ వెట్రి కళగం' రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 234 స్థానాలకు గాను 107 స్థానాల్లో ఘన విజయం సాధించింది. అయితే.. మెజార్టీ మార్క్ 118 స్థానాలకు దూరమైనప్పటికీ.. తమిళ రాజకీయాల్లో విజయ్ సంచలనంగా నిలిచారు. సినీ రంగం నుంచి ప్రజాసేవలోకి మారుతున్న విజయ్ ప్రస్థానంలో ఇదో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.
ఇవీ చదవండి:
'ఆప్‌లాగే టీఎంసీ అవినీతిమయమైంది.. తదుపరి టార్గెట్ అదే..'
ముహూర్తం ఫిక్స్.. మే 9న బెంగాల్‌లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..