Share News

'ఆప్‌లాగే టీఎంసీ అవినీతిమయమైంది.. తదుపరి టార్గెట్ అదే..'

ABN , Publish Date - May 05 , 2026 | 11:21 AM

బెంగాల్‌లో అఖండ విజయం అనంతరం సీఎం రేసులో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి స్పందించారు. ఆప్‌లాగే టీఎంసీ అవినీతిమయమైందని, ఆ పార్టీ పతనం ఖరారైందని ఆయన విమర్శించారు.

'ఆప్‌లాగే టీఎంసీ అవినీతిమయమైంది.. తదుపరి టార్గెట్ అదే..'
Suvendu Adhikari

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున 2 స్థానాల్లో బరిలోకి దిగిన సువేందు అధికారి మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు. ఈ సందర్భంగా సువేందు స్పందిస్తూ.. తమ తదుపరి టార్గెట్ ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని అన్నారు. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేతను ఉద్దేశించి.. మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీల పనైపోయిందని.. తర్వాతి వంతు అఖిలేశ్ యాదవేనని హెచ్చరికలు జారీచేశారు.


తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చారు సువేందు. ఆప్‌లాగే టీఎంసీ కూడా అవినీతిమయమైందని, పతనం ఖరారైందని విమర్శించారు. 'మమత నేతృత్వంలోని టీఎంసీ పార్టీ.. కుటుంబ కేంద్రీకృతమైంది. ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవు. ఆ కారణంగానే నందిగ్రామ్‌ ప్రజలు మరోసారి నన్ను గెలిపించారు. అక్కడ ముస్లిం ఓట్లన్నీ టీఎంసీ ఖాతాలోకే వెళ్లాయి. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులే నాకు ఓటు వేశారు. ఇది హిందువులు, బెంగాల్, ప్రధాని మోదీల విజయం. దీంతో దీదీ రాజకీయ బహిష్కరణ ఖాయమైంది' అని సువేందు చెప్పారు. త్వరలోనే టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరతారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తమ తదుపరి దృష్టి సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)పై కేంద్రీకరిస్తామని అఖిలేశ్ యాదవ్‌కు హెచ్చరికలు జారీచేశారు. ఆ దిశగా 2027 ఉత్తర్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేస్తున్నట్టు తెలిపారు సువేందు.


ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా.. తూర్పు మిడ్నాపూర్ వంటి జిల్లాలలో టీఎంసీ ఎదుగుదలలో సువేందు కీలక పాత్ర పోషించారు. కానీ.. 2020లో మమతతో విబేధించి బీజేపీలో చేరారు. ఆపై ఆమె ఓటమిని శాసించారు. నందిగ్రామ్‌లో టీఎంసీకి చెందిన పవిత్ర కర్‌ను కూడా సువేందు ఓడించారు. ఇప్పుడు బీజేపీ సీఎం రేసులో ఆయన పేరు ముందు వరుసలో ఉంది.


ఇవీ చదవండి:

టార్గెట్‌ తెలంగాణ?

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్..

Updated Date - May 05 , 2026 | 11:58 AM