ముగిసిన ‘కమ్యూనిస్టు’ల కథ!
ABN , Publish Date - May 05 , 2026 | 06:04 AM
దేశంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కమ్యూనిస్టు పార్టీల వైభవం ఇక దాదాపు ముగిసినట్టే! గతంలో దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన పశ్చిమబెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వామపక్షాల ప్రభ ఇప్పటికే మసకబారిపోగా..
కేరళలో ఓటమితో ఎర్రజెండా పాలనకు ముగింపు
దేశంలో ఆ పార్టీల నుంచి సీఎం లేకపోవడం 50 ఏళ్లలో తొలిసారి
దేశంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కమ్యూనిస్టు పార్టీల వైభవం ఇక దాదాపు ముగిసినట్టే! గతంలో దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన పశ్చిమబెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో వామపక్షాల ప్రభ ఇప్పటికే మసకబారిపోగా.. చివరకు లెఫ్ట్ అధికారంలో ఉన్న మిగిలిన ఒకే ఒక్క రాష్ట్రం ‘కేరళం’ కూడా చేజారింది. సోమవారం విడుదలైన ఫలితాల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమి ఓటమిని మూటగట్టుకుంది. దీంతో 1977 నుంచి అంటే దాదాపు గత ఐదు దశాబ్దాల కాలంలో చూస్తే... దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీల తరఫున ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి లేకుండా పోవడం ఇదే తొలిసారి అవుతుంది. గతంలో వామపక్ష పార్టీలు బలంగా ఉండేవి. పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళంలో రికార్డు స్థాయిలో చాలా ఏళ్ల పాటు ఒకేసారి అధికారంలో కొనసాగుతూ వచ్చాయి. 2004 సార్వత్రిక ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఏకంగా 60కి పైగా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాయి. భారీ సంఖ్యలో ఎంపీలు ఉన్న లెఫ్ట్ ఫ్రంట్... భారత్-అమెరికా అణు ఒప్పందం నేపథ్యంలో మద్దతు ఉపసంహరించుకోవడంతో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.
బెంగాల్‌లో సుదీర్ఘ పాలన
పశ్చిమబెంగాల్‌లో సీపీఎం 1977లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తిరిగి చూడకుండా 2011 వరకు ఏకంగా 34 ఏళ్ల సుదీర్ఘ కాలం వామపక్షాలు ఏకచత్రాధిపత్యంతో పాలన చేశాయి. జ్యోతిబసు 23 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగగా.. ఆ తర్వాత 2000లో పాలనా పగ్గాలను బుద్ధదేవ్ భట్టాచార్యకు అప్పగించారు. అనంతరం 11 ఏళ్ల పాటు ఆయన నేతృత్వంలో పశ్చిమబెంగాల్‌ను సీపీఎం కూటమి పాలించింది. ఇక, 1993 నుంచి 2018 వరకు వామపక్షాలు త్రిపురను పాలించాయి. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు ఘన విజయం సాధించాయి. సీపీఎం ఒక్కటే 60 సీట్లకు గానూ 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 1998 వరకు సీఎంగా దశరథ్ దేబ్ ఉండగా.. ఆ తర్వాత ముఖ్యమత్రి పీఠం ఎక్కిన మాణిక్ సర్కార్.. 20 ఏళ్ల పాటు పాలన చేశారు. అనంతరం 2018లో బీజేపీ అనూహ్య గెలుపుతో సుదీర్ఘ పాలనకు ‘ఎండ్ కార్డు’ పడింది. ఇక కేరళంలో వామపక్షాలు, కాంగ్రెస్ మధ్య దశాబ్దాలుగా అధికారం మారుతూ రాగా.. విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తూ 2016, 2021లో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. వామపక్ష చివరి ‘కంచుకోట’ కేరళం కూడా తాజాగా చేజారింది.