కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతులు, రైల్వేలు, పరిశ్రమలకు భారీ ఊతం
ABN , Publish Date - May 13 , 2026 | 03:30 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్రకేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేంద్రమంత్రులతో ప్రధాని చర్చించారు.
ఢిల్లీ, మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ఈరోజు(బుధవారం) ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేంద్రమంత్రులతో ప్రధాని చర్చించారు. ఈ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో పశ్చిమాసియా సంక్షోభం, పెరుగుతున్న గ్లోబల్ ఆయిల్ రేట్స్, ఇంధన సంరక్షణ, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసెస్, బంగారం కొనుగోళ్ల వాయిదాపై చర్చించినట్లు సమాచారం. అలాగే, ఖరీఫ్ సీజన్ మద్దతు ధరల నుంచి కోల్ గ్యాసిఫికేషన్, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయ ఆధునికీకరణ వరకు భారీ కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఖరీఫ్ మద్దతు ధరలకు రూ.2.60 లక్షల కోట్లు..
దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల (MSP) అమలుకు కేంద్ర కేబినెట్ రూ.2,60,000 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వ్యవసాయ రంగానికి ఆర్థిక భరోసా లభించనుంది.
పెంచిన ధరలివే..
ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయా పంటలకు క్వింటాకు పెంచిన రేట్లు ఇలా ఉన్నాయి.
వరి (సాధారణ రకం) - రూ.2441
వరి (గ్రేడ్ ఏ) - రూ.2461
హైబ్రిడ్ జొన్నలు - రూ.4023
మల్దండి జొన్నలు - రూ.4073
సజ్జలు - రూ. 2900
రాగులు - రూ.525
మొక్కజొన్న - రూ. 2410
కందులు - రూ. 8450
పెసర్లు - రూ.8780
మినుములు - రూ.8200
పత్తి (మధ్యరకం) - రూ.8267
పత్తి (లాంగ్ రకం) - రూ. 8667
వేరుశనగ - రూ.7517
పొద్దుతిరుగుడు - రూ.8343
సోయాబీన్ - రూ.5708
నువ్వులు - రూ.10,346
ఒడిసలు - రూ.10,052
కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి రూ.37,500 కోట్లు..
దేశంలో బొగ్గు వినియోగాన్ని ఆధునికీకరించేందుకు కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు రూ.37,500 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా దిగుమతి ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు దేశీయ పరిశ్రమలకు మద్దతు లభించనుంది.
సెమీ హైస్పీడ్ రైల్వేలైన్‌కు గ్రీన్ సిగ్నల్..
గుజరాత్‌లో సర్కేజీ - ధోలేరా మధ్య సెమీ హైస్పీడ్ డబుల్ రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.20,065 కోట్ల వ్యయాన్ని కేటాయించింది. రైల్వే కనెక్టివిటీ మెరుగుపడి పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.
నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయ ఆధునికీకరణ..
మహారాష్ట్రలోని నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునికీకరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త సదుపాయాలు, విస్తరణ పనులతో విమానాశ్రయ సేవలు మరింత మెరుగుపడనున్నాయి. దీని ద్వారా ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
అభివృద్ధి, మౌలిక వసతులపై కేంద్రం ఫోకస్..
ఈ నిర్ణయాలతో వ్యవసాయం, రైల్వేలు, ఇంధన రంగం, విమానయాన రంగాలకు భారీ ప్రోత్సాహం లభించనుంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.