యుద్ధం తమిళనాడు, ఢిల్లీ మధ్యే: ఉదయనిధి స్టాలిన్
ABN , Publish Date - Mar 30 , 2026 | 08:28 PM
అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామికి ఉద్వాసన పలకాలని, తద్వారా బీజేపీ మాయమాటలకు తమిళనాడు లొంగదని బలంగా చాటిచెప్పాలని డీఎంకే నేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
కాంచీపురం: అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామికి ఉద్వాసన పలకాలని, తద్వారా బీజేపీ మాయమాటలకు తమిళనాడు లొంగదని బలంగా చాటిచెప్పాలని డీఎంకే నేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు, ఢిల్లీకి మధ్య జరుగుతున్న పోరుగా తన తండ్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రికి తమిళనాడులో చోటీయరాదని అన్నారు. డీఎంకే వ్యవస్థాపక నేత సీఎన్ అన్నాదురై స్వస్థలమైన కాంచీపురం నుంచి ఉదయనిధి స్టాలిన్ ఎన్నికల ప్రచారాన్ని సోమవారంనాడు లాంఛనంగా ప్రారంభించారు.
అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ప్రధానమంత్రి మోదీకి 'కట్టుబానిస' అని ఉదయనిధి ఘాటుగా విమర్శించారు. ప్రధాని మోదీ, అమిత్‌షాలు అన్నాడీఎంకే నేత సైద్ధాంతిక మార్గదర్శకులని అన్నారు. ఆ కారణంగానే అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామికి ఈ ఎన్నికల్లో ఉద్వాసన పలాకాలని అన్నారు. 'మోదీ, అమిత్‌షాను తమిళనాడులో అనుమతిద్దామా? తమిళ ప్రజలు ఎన్నటికీ వారిని అనుమతించరు' అని అన్నారు. తమిళనాడు ఎప్పుడూ ఢిల్లీ కంట్రోల్‌లో ఉండదని కచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉందని, రాష్ట్రాన్ని వంచించిన బీజేపీని పూర్తిగా పక్కకుపెట్టడం తప్పనిసరి అని చెప్పారు.
సంక్షేమ పథకాలు హైలైట్
ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను డీఎంకే ప్రభుత్వం విజయవంతంగా రాష్ట్రంలో అమలు చేస్తోందని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. కాంచీపురంలో మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేశామని, డీఎంకే 'ఉదయిస్తున్న సూర్యుడు'కు ప్రజలు మద్దతుగా నిలలవాలని కోరారు. దీనికి ముందు అన్నాదురై విగ్రహానికి ఉదయనిధి పూలమాల వేసి నివాళులర్పించారు. షెడ్యూల్ ప్రకారం డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.కరుణానిధి స్వస్థలమైన తిరువారూర్ నుంచి తన ప్రచారాన్ని మంగళవారంనాడు ఆయన ప్రారంభించాల్సి ఉంది. మరోవైపు, అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి బీజేపీకి కేటాయించిన మైలాపూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
నామినేషన్ వేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
పెరంబూర్‌లో నామినేషన్ వేసిన విజయ్