ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. బీజేపీ కొత్త సీఎం ఎంపికకు కసరత్తు
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:13 PM
రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారంనాడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కౌన్సిల్ చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్‌కు అందజేశారు.
పాట్నా: రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) సోమవారంనాడు ఎమ్మెల్సీ (MLC) పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కౌన్సిల్ చైర్మన్ అవధేష్ నారాయణ్ సింగ్‌కు అందజేశారు. నితీశ్ కుమార్ మార్చి 16న రాజ్యసభ ఎన్నికయ్యారు. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రెండు సభల్లో సభ్యత్వం కలిగి ఉండరాదు. 14 రోజుల్లోగా ఏదో ఒక పదవిని వదులుకోవాల్సి ఉంటుంది.
నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్తుండటంతో బిహార్‌లో తదుపరి ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ సిద్ధమవుతోంది. గత వారంలో జేడీయూలో చేరిన నితీశ్ కుమారుడు నిశాంత్ కుమార్‌కు కొత్త ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సీఎం రేసులో కీలక నేతలు
బీజేపీ నుంచి కొత్త ముఖ్యమంత్రి రేసులో పలువురు ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది.
1.సామ్రాట్ చౌదరి: ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి ప్రస్తుతం తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ నేత అరుణ్ కుమార్‌పై ఆయన 45,843 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
2.నిత్యానంద్ రాయ్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బిహార్‌లోని ఉజియార్‌పూర్ నియోజకవర్గం లోక్‌సభ ఎంపీ.
3.విజయ్ కుమార్ సిన్హా: బిహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2010 నుంచి లఖిసరాయ్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.
4.సంజయ్ చౌరాసియా: డిఘా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2025 ఎన్నికల్లో సీపీఐ-ఎంఎల్ అభ్యర్థి దివ్య గౌతమ్‌పై ఆయన 59,079 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
5.నితీశ్ మిశ్రా: మధుబని జిల్లాలోని ఝంఝార్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో 52,000 ఓట్లకు పైగా ఆధిక్యతతో ఆయన గెలుపొందారు.
6.దిలీల్ జైశ్వాల్: బిహార్ బీజేపీ మాజీ అధ్యక్షుడు. మూడోసారి బిహార్ ఎమ్మెల్సీగా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కిషన్‌గంజ్ నుంచి పోటీ చేశారు.
7.రామ్ క్రిపాల్ యాదవ్: 2025 నుంచి బిహార్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. బిహార్‌లోని పాటలీపుత్ర పార్లమెంటరీ నియోజకవర్గం లోక్‌సభ ఎంపీగా కూడా పనిచేశారు.
8.జనక్ రామ్: బీహార్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. గోపాల్‌గంజ్ లోక్‌సభ ఎంపీగా కూడా పనిచేశారు.
ఇవి కూడా చదవండి..
పెరంబూర్‌లో నామినేషన్ వేసిన విజయ్
నామినేషన్ వేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్