ఏఐ వీడియోలతో అప్రమత్తంగా ఉండాలి.. అస్సాం కార్యకర్తలకు మోదీ దిశానిర్దేశం
ABN , Publish Date - Mar 30 , 2026 | 02:59 PM
క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.
న్యూఢిల్లీ: క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టాలని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దిశానిర్దేశం చేశారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నమో యాప్ ద్వారా 'మేరా బూత్ సబ్‌సే మజబూత్ సంవాద్' ప్రోగ్రాంలో ప్రధాని సోమవారంనాడు పాల్గొన్నారు. అస్సాంలో బీజేపీ-ఎన్డీయే మూడోసారి ఘనవిజయం సాధించేందుకు కార్యకర్తలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. కూటమికి రాష్ట్రంలో సంపూర్ణ మద్దతు ఉందని, కార్యకర్తల ఫీడ్‌బ్యాక్‌తో ప్రచారం మరింత పటిష్ఠమవుతుందని అన్నారు.
సుస్థిర ప్రగతి అవసరం
బీజేపీ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా అస్థిరత ఉండేదని ప్రధాని అన్నారు. గత శతాబ్ద కాలంలో అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లు కాంగ్రెస్ హయాంలో పాలనను గుర్తించుకోవాలన్నారు. చిన్న పొరపాటు జరిగినా అస్సాం మళ్లీ వెనక బాటపడుతుందని, నిలకడైన అభివృద్ధికి శాంతి, సుస్థిరత అనివార్యమని చెప్పారు.
ఏఐ జనరేటెడ్ వీడియోలతో అప్రమత్తం
ఎన్నికల సమయంలో ఏఐ జనరేటెడ్ నకీలీ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు ప్రధాని సూచించారు. తప్పుడు సమాచారం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియకు ఎలాంటి అవాంతరం కలుగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. తిరుగుబాటు సంస్థలు, విద్యార్థి సంఘాలతో సురక్షితమైన ఒప్పందాలు చేసుకోవడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దాంతో ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం అశాంతి కొనసాగిందని తెలిపారు.
అస్సాం ఎన్నికలు - 2026
కాగా, నియోజకవర్గాల పునర్విభజన తరువాత అస్సాంలో ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. 126 మంది సభ్యుల అస్సాం అసెంబ్లీకి ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి. ప్రస్తుత అసెంబ్లీలో అధికార బీజేపీకి 64 మంది సభ్యుల బలం ఉంది. దాని భాగస్వాపక్షమైన ఏజీపీకి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. యూపీపీఎల్‌కు 7, బీపీఎఫ్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు. విపక్షంలో కాంగ్రెస్‌కు 26 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, ఏఐయూడీఎఫ్‌కు 15 మంది, సీపీఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా సభలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
నిరుద్యోగులకు ప్రతినెలా 4 వేలు