నిరుద్యోగులకు ప్రతినెలా 4 వేలు
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:36 AM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తమిళగ వెట్రి కళగం(టీవీకే)కు చెందిన ప్రజా కూటమికి, సీఎం స్టాలిన్ నాయకత్వంలోని అతుకుల బొంత కూటమికి మధ్యే ద్విముఖపోటీ అని టీవీకే పార్టీ అధినేత....
విద్యార్థులకు రూ.20 లక్షల వరకు వడ్డీలేని రుణాలు.. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ సకాలంలో భర్తీకి జాబ్ క్యాలెండర్
యువతకు టీవీకే పార్టీ 10 వరాలు
తమిళనాడులోని అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించిన విజయ్
చెన్నై, మార్చి 29(ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తమిళగ వెట్రి కళగం(టీవీకే)కు చెందిన ప్రజా కూటమికి, సీఎం స్టాలిన్ నాయకత్వంలోని అతుకుల బొంత కూటమికి మధ్యే ద్విముఖపోటీ అని టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ చెప్పారు. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను ఆదివారం చెన్నైలో ఆయన విడుదల చేసి, అభ్యర్థులందరినీ సభకు పరిచయం చేశారు. అలాగే, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని నియోజకవర్గాలకూ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి, వారినీ పరిచయం చేశారు. వీరంతా అభ్యర్థులు మాత్రమే కాదని, ప్రజా రక్షకులని అభివర్ణించారు. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల విజయ్ పోటీ చేయనున్నారు. విజిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. యువత కోసం పది హామీలతో ప్రత్యేకమైన మేనిఫెస్టోను కూడా విజయ్ ప్రకటించారు.
యువతకు విజయ్ హామీలు ఇవీ..
మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చదిద్దేందుకు పాఠశాలలు, కళాశాలల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక సంఘాల ఏర్పాటు, విద్యా భరోసా పథకం కింద ప్లస్-2 నుంచి పీహెచ్‌డీ వరకు చదివే విద్యార్థులకు రూ.20లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్, ఉపాధి కల్పన కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని, వయసు 29 ఏళ్లు దాటినా ఉద్యోగం రాని యువతకు ప్రతినెలా రూ.4వేలు, డిప్లొమా చేసినవారికి యువత సంక్షేమ నిధి కింద ప్రతినెలా రూ.2,500 ఇస్తామని విజయ్ హామీలు ఇచ్చారు. ఏటా 5 లక్షల మందికి ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తామన్నారు.
బెంగాల్‌లో కాంగ్రెస్ తొలి జాబితా
పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేయనున్న కాంగ్రెస్ ఆదివారం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీలో మొత్తం 294 స్థానాలు ఉండగా, అందులో 284 స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జాబితాలో ఉన్న ప్రముఖుల్లో పీసీసీ మాజీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధురి ఉన్నారు. ఆయన బహరాంపూర్ నుంచి పోటీ చేయనున్నారు.
అసోంపై కాంగ్రెస్ 5 గ్యారెంటీల అస్త్రం
అసోం అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ఐదు గ్యారెంటీల అస్త్రాన్ని ప్రయోగించింది. లఖింపూర్ జిల్లా నౌబోయిచాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. మహిళా సంక్షేమం, ఉచిత వైద్యం, భూహక్కులే లక్ష్యంగా తమ మ్యానిఫెస్టో ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలకు ప్రతి నెలా నగదు నేరుగా బదిలీ చేయడంతో పాటు, కొత్తగా వ్యాపారం ప్రారంభించే లేదా విస్తరించే మహిళలకు అదనంగా రూ.50వేల ఆర్థికసాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.25లక్షల వరకు నగదు రహిత ఆరోగ్యబీమా సౌకర్యం కల్పిస్తామని, 10లక్షల మంది స్థానిక ప్రజలకు శాశ్వత భూపట్టాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. వృద్ధులకు ప్రతి నెల రూ.1250 పింఛను అందజేస్తామన్నారు.