పెరంబూర్‌లో నామినేషన్ వేసిన విజయ్
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:19 PM
తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీకి సోమవారంనాడు నామినేషన్ వేశారు. తూర్పు తిరుచ్చి నుంచి కూడా ఆయన పోటీలో ఉన్నారు.
చెన్నై: తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ (Vijay) పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీకి సోమవారంనాడు నామినేషన్ వేశారు. తూర్పు తిరుచ్చి నుంచి కూడా ఆయన పోటీలో ఉన్నారు. పెరంబూర్‌లో నామినేషన్ వేసేందుకు వచ్చిన విజయ్‌ను చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున అక్కడకు వచ్చారు. నామినేషన్ అనంతరం పెరంబూర్‌లో ఓపెన్ టాప్ వాహనంలో ప్రచారం సాగించారు.
ప్రజల రుణం తీర్చుకుంటా
డీఎంకే ఒక దుష్టశక్తి అని మరోసారి విజయ్ విమర్శించారు. డీఎంకే హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మాదకద్రవ్యాల బెడద ఉందని ఉన్నారు. ఈ దుస్థితికి దుష్టశక్తి డీఎంకే, స్టాలిన్ కారణమని విమర్శించారు. తమిళనాడును తాము కాపాడతామని, సాఫీగా తన జీవితం సాగుతున్నప్పటికీ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజాసేవతో వారి రుణం తీర్చుకుంటున్నానని చెప్పారు.
విజిల్‌తో తరిమికొట్టండి..
ప్రజలకు తాను అబద్ధాలు చెప్పనని, వంచనకు పాల్పడనని విజయ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మత్తుపదార్థాల వాడకాలతో హింసాత్మక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇది దేశమా? అడవా? ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని వరుస ప్రశ్నలు గుప్పించారు. డీఎంకే దుష్టశక్తి పాలనలో భద్రత ఉందా? మీ పిల్లలు క్షేమంగా ఉండగలరా? మీరు ప్రశాంతంగా బతకగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని లిక్కర్ కార్పొరేషన్ టీఏఎస్ఎంఏసీలో రూ.1,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వంలో భద్రత కానీ, ఉపాధి కానీ లేదని, టీవీకే 'విజిల్' గట్టిగా ఊది డీఎంకేను ఈ ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. టీవీకే ఈ ఎన్నికల్లో 234 నియోజవర్గాలో ఒంటరిగా పోటీ చేస్తోంది. తమిళనాడులో డీఎంకే-టీవీకే మధ్యే ప్రధాన పోటీ అంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మే 4న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
నామినేషన్ వేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్
నిరుద్యోగులకు ప్రతినెలా 4 వేలు