శబరిమలపై మోదీ మౌనం వెనుక కారణమదే.. రాహుల్ ఆరోపణ
ABN , Publish Date - Mar 30 , 2026 | 06:55 PM
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు బీజేపీ పరోక్షంగా మద్దతిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోటీ యూడీఎఫ్‌కు, సీపీఎం-బీజేపీ కంబైన్‌కు మధ్యే జరగనుందని అన్నారు.
పతనంతిట్ట: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)కు బీజేపీ (BJP) పరోక్షంగా మద్దతిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోటీ యూడీఎఫ్‌కు, సీపీఎం-బీజేపీ కంబైన్‌కు మధ్యే జరగనుందని అన్నారు. పతనాంతిట్ట జిల్లాలోని అదూర్‌లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్ మాట్లాడుతూ, కేరళలో యూడీఎఫ్ ఉండకూడదని బీజేపీ కోరుకుంటోందని, ఎందుకంటే కాంగ్రెస్‌కు మాత్రమే జాతీయ స్థాయిలో బీజేపీని సవాలు చేయగలిగే శక్తి ఉందనే విషయం వాళ్లకు బాగా తెలుసునని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌తో తాము సైద్ధాంతిక పోరాటం చేస్తున్నామని తెలిపారు.
విపక్ష నేతలను సెంట్రల్ ఏజెన్సీలు టార్గెట్ చేస్తున్నాయని, కానీ ఎల్డీఎఫ్‌పై మాత్రం ఎలాంటి దర్యాప్తులు ఉండవని రాహుల్ విమర్శించారు. తనపై 36 కేసులు పెట్టారని, 55 గంటల సేపు నిర్వరామంగా ప్రశ్నించారని అన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌పై మాత్రం ఎలాంటి చర్యలు లేవన్నారు.
పాలక్కాడులో మోదీ మౌనం
ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా ఆలయాలు, మతం గురించి మాట్లాడతారని, కానీ ఇటీవల పాలక్కాడ్ పర్యటనలో శబరిమల అంశాన్ని లేవనెత్తడం మరిచిపోయారని రాహుల్ విమర్శించారు. శబరిమలలోని అయ్యప్ప ఆలయంతో ముడిపడి ఉన్న అంశంపై మాట్లాడకపోవడం ద్వారా బీజేపీ, ఎల్డీఎఫ్ కలిసి పనిచేస్తున్నట్టు స్పష్టమవుతోందన్నారు. యూడీఎఫ్ అధికారంలోకి వస్తే ఆలయంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా.. బీజేపీ కొత్త సీఎం ఎంపికకు కసరత్తు
పెరంబూర్‌లో నామినేషన్ వేసిన విజయ్