లైంగిక వేధింపుల కేసు.. టీవీకే నేత అరెస్ట్..
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:26 PM
తమిళనాడులో పీజీ విద్యార్థినిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో టీవీకే పార్టీకి చెందిన స్థానిక నేతను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో విద్యార్థినిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి చెందిన స్థానిక నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ వర్షం పడుతున్న సమయంలో కారులో లిఫ్ట్ ఇస్తానని నమ్మించి, కాలేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం...
తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని, ఆమె స్నేహితురాలు కాలేజీ ముగిసిన తర్వాత బస్సు కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో కారులో అటుగా వెళ్తున్న టీవీకే సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడైన క్రిస్టోఫర్.. వారికి లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు.
వర్షం ఎక్కువగా కురుస్తుండటం, బస్సులు కూడా లేకపోవడంతో ఆ ఇద్దరు పీజీ విద్యార్థినులు అతడి కారులో ఎక్కారు. మార్గమధ్యంలో ముందుగా ఒక విద్యార్థినిని దింపిన క్రిస్టోఫర్.. మరో విద్యార్థినిని కులశేఖరం వైపు వెళ్తున్నానని నమ్మించి.. కారులో అలాగే చాలా దూరం తీసుకెళ్లాడు. అయితే, కొద్దిసేపటి తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి విద్యార్థినిపై లైంగికంగా వేధించి అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధిత విద్యార్థిని వెంటనే జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు క్రిస్టోఫర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే తీవ్రంగా మండిపడ్డాయి. టీవీకే పార్టీ నేతల తీరుపై విమర్శలు గుప్పించాయి. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన టీవీకే నేత సి.టి. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీలో ఉండే ఎవరైనా సరే... తప్పు చేస్తే పార్టీ పరమైన, చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశాడు. పోలీసుల విచారణ ఆధారంగా నిందితుడిపై తదుపరి చర్యలు ఉంటాయని నిర్మల్ కుమార్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు
మూడు మ్యాచ్‌లకే భువనేశ్వర్‌పై వేటు పడనుందా.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..