ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం.. ముగ్గురు కోచ్‌లకు వీడ్కోలు
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:52 PM
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ తమ కోచింగ్ సిబ్బందిలో పూర్తిస్థాయిలో మార్పులకు శ్రీకారం చుట్టింది. హెడ్ కోచ్ పదవి నుంచి మహేల జయవర్ధనే వైదొలగడంతో.. కీరన్ పోలార్డ్‌తో ఆ స్థానం భర్తీ చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ తమ కోచింగ్ సిబ్బందిలో పూర్తిస్థాయిలో మార్పులకు శ్రీకారం చుట్టింది. హెడ్ కోచ్ పదవి నుంచి మహేల జయవర్ధనే వైదొలగడంతో .. కీరన్ పొలార్డ్‌తో ఆ స్థానం భర్తీ చేసింది. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ అయిన పొలార్డ్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ముంబై జట్టు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బౌలింగ్ కోచ్‌లు లసిత్ మలింగ, పారస్ మంబ్రేతో ముంబై తెగదెంపులు చేసుకుంది. వీరిద్దరితో పాటు ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్కిన్సన్‌ను కూడా తొలగించింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఎక్స్ వేదికగా అధికారికంగా ఇవాళ( గురువారం) ప్రకటించింది.
'లసిత్ మలింగ ముంబై ఇండియన్స్ కుటుంబంలో ఎప్పటికీ అంతర్భాగమే. ఈ ఫ్రాంచైజీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. ముంబై బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తూ నాలుగు ఐపీఎల్ టైటిల్స్ అందించిన ఘనత మలింగదే. ఆ తర్వాత ఒక మెంటార్‌గా, కోచ్‌గా తన సేవలను అందించి జట్టును విజయవంతంగా నడిపించాడు. ముంబై ఇండియన్స్‌తో అతడి జర్నీ ఒక మధురమైనది. ఈ రోజు అతడు బౌలింగ్‌కోచ్‌గా తన బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు' అని ముంబై ఒక ప్రకటనలో పేర్కొంది.
మలింగ రెండేళ్ల క్రితం ముంబై బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2024 నుంచి 2026 వరకు వరుసగా మూడు సీజన్ల పాటు సేవలను అందించాడు. అతడితో మరో బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన భారత మాజీ పేసర్ అయిన మంబ్రేకు కూడా ముంబై జట్టుతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2011 నుంచి 2017 వరకు ముంబై బౌలింగ్ కోచ్‌గా పనిచేసి.. మళ్లీ 2024 నుండి 2026 వరకు ముంబై ఫ్రాంచైజీలో భాగమయ్యాడు. ఇంగ్లండ్ మాజీ ఫీల్డింగ్ కోచ్ హాప్కిన్సన్ 2025 సీజన్‌కు ముందే ఎంఐ జట్టులోచేరి.. తాజాగా తప్పుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
మూడు మ్యాచ్‌లకే భువనేశ్వర్‌పై వేటు పడనుందా.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
బంగ్లాదేశ్ గడ్డపై జోమెల్ వారికన్ చరిత్ర.. 5 వికెట్లతో అరుదైన రికార్డు