Share News

గిల్ నుదుటిపై కొత్త పరికరం.. 'టెంపుల్'పై క్రీడా ప్రముఖుల ఆసక్తి..

ABN , Publish Date - Oct 29 , 2026 | 01:46 PM

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొత్త సాంకేతిక పరికరంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు సన్నాహకంగా ఆక్లాండ్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో గిల్ ఏఐ ఆధారిత ఫిట్‌నెస్ ట్రాకింగ్ పరికరం 'టెంపుల్'‌ను ధరించి కనిపించాడు.

గిల్ నుదుటిపై కొత్త పరికరం.. 'టెంపుల్'పై క్రీడా ప్రముఖుల ఆసక్తి..
Shubman Gill

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొత్త సాంకేతిక పరికరంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు సన్నాహకంగా ఆక్లాండ్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో గిల్ ఏఐ ఆధారిత ఫిట్‌నెస్ ట్రాకింగ్ పరికరం 'టెంపుల్'‌ను ధరించి కనిపించాడు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ రూపొందిస్తున్న ఈ పరికరం ప్రస్తుతం మార్కెట్లోకి ఇంకా విడుదల కాలేదు (Shubman Gill Temple device).


గిల్ నుదుటిపై, కళ్లకు కొద్దిగా పైన ఉన్న ఈ పరికరం పేరు 'టెంపుల్'. సాధారణంగా చేతికి ధరించే స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్లు.. గుండె స్పందన, శారీరక శ్రమ వంటి అంశాలను నమోదు చేస్తాయి. అయితే టెంపుల్ పరికరం మెదడుకు రక్తప్రసరణ, నాడీ వ్యవస్థ స్పందనలు, మానసిక ఒత్తిడి స్థాయి వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది. అథ్లెట్లు తీవ్ర శారీరక శ్రమకు గురైనప్పుడు వారి శరీరం, నాడీ వ్యవస్థ ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది (AI fitness tracker).


జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ స్థాపించిన టెంపుల్ సంస్థ ఈ పరికరాన్ని అభివృద్ధి చేస్తోంది (Temple wearable technology). గతంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా ఈ పరికరాన్ని ధరించి కనిపించింది. ప్రస్తుతం టెంపుల్ పరికరం సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు. దీని ధర, అధికారిక విడుదల తేదీ, పూర్తిస్థాయి సాంకేతిక వివరాలపై స్పష్టత లేదు. కాగా, తమ పరికరానికి ప్రీ-బుకింగ్ ఆర్డర్లు చాలా ఎక్కువగా వస్తున్నాయని తాజాగా గోయల్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

మూడు మ్యాచ్‌లకే భువనేశ్వర్‌పై వేటు పడనుందా.. అశ్విన్ కీలక వ్యాఖ్యలు..


పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 29 , 2026 | 01:46 PM