Share News

బాలికను బెదిరిస్తే సహించం.. బాధితురాలి భద్రతపై సుప్రీం సీరియస్

ABN , Publish Date - Sep 10 , 2026 | 08:47 PM

గత జులైలో జరిగిన సీజేపీ నిరసనల్లో పాల్గొన్న ఓ బాలికపై నమోదైన వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. బాలికపై హింసకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు.. బాధితురాలిని గానీ, ఆమె కుటుంబాన్ని గానీ బెదిరిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

బాలికను బెదిరిస్తే సహించం.. బాధితురాలి భద్రతపై సుప్రీం సీరియస్

ఇంటర్నెట్ డెస్క్: గత జులైలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల్లో పాల్గొన్న 14 ఏళ్ల బాలికపై నమోదైన వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై గురువారం విచారణ చేపట్టిన సీజేఐ సూర్యకాంత్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం.. నేర దర్యాప్తు, న్యాయపరమైన చర్యలను కొనసాగించకుండా బాధితురాలిని లేదా ఆమె కుటుంబ సభ్యులను బెదిరించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. బాలికపై హింసకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు స్వేచ్ఛగా తిరుగుతూ.. ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.


కాగా.. ఈ విషయమై బాలిక తరఫు న్యాయవాది కోర్టుకు పలు అంశాలను వివరించారు. రైట్‌ వింగ్‌ కార్యకర్త స్వతంత్ర భరద్వాజ్‌పై కేసు నమోదైన తర్వాత ఆమెను వేధించడం సహా ఇంటినీ ధ్వంసం చేశారని ఆరోపించారు. నిరసన సందర్భంగా బాలిక తండ్రిపైనా దాడి చేసినట్లు తెలిపారు. సంబంధిత వీడియోలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. కేసు విచారణకు ఉన్నతస్థాయి కమిటీకి కొంత సమయం పట్టే అవకాశం ఉందని.. ఈలోగా బాలికకు ఏదైనా జరిగితే ఆ నష్టాన్ని భర్తీ చేయడం అసాధ్యమని వాదించారు. ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం.. బాలికపై హింసకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు స్వేచ్ఛగా తిరుగుతూ.. బాధిత కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేస్తే తీవ్రంగా పరిగణిస్తామంది. బాలికపై హింసకు సంబంధించిన అంశాల్లో ఎవరినీ రక్షించకూడదని కూడా పేర్కొంది.


స్వతంత్ర భరద్వాజ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఎస్సీ, ఎస్టీ(అత్యాచారాల నిరోధక) చట్టంలోని నిబంధనలతో పాటు నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన సెక్షన్లను ఢిల్లీ పోలీసులు సెప్టెంబర్‌ 5న చేర్చినట్లు సమాచారం. బాలిక తండ్రిపై దాడి చేసినట్లు భరద్వాజ్‌ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారని, రాజకీయ ప్రోత్బలంతోనే అరెస్ట్ నుంచి తప్పించుకున్నానని చెప్పినట్లు వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. ఈ పరిణామాల అనంతరం ఆయన్ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీజేపీ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన జరిగినట్లు తెలుస్తోంది. ఆ సందర్భంగా భరద్వాజ్‌ను బులంద్‌షహర్‌లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


ఇవీ చదవండి:

బ్రిక్స్‌ సదస్సుకు ముందు భారత్-రష్యా మధ్య భారీ డీల్

ఆస్తి కోసం కొడుకు కుట్ర.. తల్లి కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరమన్న సుప్రీంకోర్టు

Updated Date - Sep 10 , 2026 | 09:01 PM