ఆస్తి కోసం కొడుకు చేసిన కుట్రలకు సుప్రీంకోర్టు చెక్.. తల్లి కాళ్లు పట్టుకోమని ఆదేశం..
ABN , Publish Date - Sep 10 , 2026 | 01:36 PM
ఓ వ్యక్తి మోసపూరితంగా తల్లిదండ్రుల ఆస్తిని తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం నకిలీ పత్రాలను తయారు చేశాడు. ఆస్తి తనదేనంటూ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. తల్లిదండ్రులను మోసం చేయాలని భావించిన అతడికి సుప్రీంకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఓ వ్యక్తి మోసపూరితంగా తల్లిదండ్రుల ఆస్తిని తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం నకిలీ పత్రాలను తయారు చేశాడు. ఆస్తి తనదేనంటూ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. తల్లిదండ్రులను మోసం చేయాలని భావించిన అతడికి సుప్రీంకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. పిటిషన్‌ను కొట్టివేయడమే కాకుండా.. తల్లి పాదాలు తాకి క్షమాపణ కోరమని అతడిని ఆదేశించింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ వృద్ధ జంట ఎంతో కష్టపడి బిల్డింగ్ కట్టుకుంది. ఆ బిల్డింగ్‌లోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఆ దంపతుల కొడుకు, కోడలు ఉంటున్నారు. ఆ బిల్డింగ్ మొత్తాన్ని సొంతం చేసుకోవాలని వృద్ధ దంపతుల కుమారుడికి బుద్ధి పుట్టింది.
ఈ నేపథ్యంలోనే నకిలీ పత్రాలు సృష్టించాడు. ఆ బిల్డింగ్‌కు తానే యజమానినని చెప్పుకోవటం మొదలెట్టాడు. దీంతో వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించారు. జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టు వారికి సానుకూలంగా తీర్పును ఇచ్చాయి. దీంతో వృద్ధ దంపతుల కుమారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. గురువారం ఈ పిటిషన్‌పై జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఆస్తి కోసం తల్లిదండ్రులను కోర్టుకు ఈడ్చిన కుమారుడికి ధర్మాసనం మొట్టికాయలు వేసింది.
‘తల్లి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకో. ఆమెను క్షమించమని కోరు’ అని ఆదేశించింది. తల్లిదండ్రులను వేధించే వారికి, ఆస్తి కోసం మోసం చేసేవారికి న్యాయస్థానాల నుంచి రక్షణ ఉండదని ధర్మాసనం పేర్కొంది. భారతీయ సమాజంలో.. అన్ని మతాల్లో తల్లికి ఉన్నతస్థానం ఉందని తెలిపింది. కొడుకు పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. 60 రోజుల్లో ఇంటిని ఖాళీ చేయాలని, తల్లిదండ్రులకు పరిహారం ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
బసవన్నల పండుగ.. అన్నదాతతో పెనవేసుకున్న బంధం
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్