ఢిల్లీలో భారీ భద్రత.. బ్రిక్స్ అతిథుల కోసం స్టార్ హోటళ్లలో 3,000కుపైగా గదుల బుకింగ్!
ABN , Publish Date - Sep 10 , 2026 | 07:46 PM
దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కీలక సమావేశానికి హాజరయ్యే విదేశీ ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల అధిపతుల కోసం ఢిల్లీలోని ప్రముఖ లగ్జరీ హోటళ్లలో 3,000కు పైగా గదులను బుక్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశ అధ్యక్షతన 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు సెప్టెంబరు 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను భారీగా పెంచారు. ఢిల్లీ పోలీసులు వేలాది మంది సిబ్బందిని రంగంలోకి దింపారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రవేశాలపై ఆంక్షలు, నిరంతర నిఘా, సమాచార సేకరణతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమానికి భద్రత కల్పించేందుకు సుమారు 15,000 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని, దాదాపు 200 కంపెనీల పారా మిలటరీ బలగాలను మోహరించారు. సదస్సుకు వచ్చే ప్రముఖులు ప్రయాణించే మార్గాల్లోనూ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, నిఘా కోసం ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ఈ సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రతినిధులు, ఆహ్వానితులు, వివిధ అంతర్జాతీయ సంస్థల అధిపతుల కోసం ఢిల్లీలోని ప్రముఖ హోటళ్లలో 3,000కు పైగా గదులను బుక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతినిధుల స్థాయి, భద్రతను దృష్టిలో పెట్టుకుని వారికి వేర్వేరు హోటళ్లలో వసతి ఏర్పాటు చేశారు.
తాజ్ మహల్ హోటల్
మాన్‌సింగ్ రోడ్డులోని తాజ్ మహల్ హోటల్‌లో లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా, ఐరోపా, కరేబియన్ దేశాలకు చెందిన పలు ప్రతినిధి బృందాలకు వసతి కల్పించారు. ప్రపంచ ఆరోగ్య, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా ఈ హోటల్‌లో ఏర్పాట్లు చేశారు.
ఒబెరాయ్
డాక్టర్ జాకిర్ హుస్సేన్ మార్గ్‌లో ఉన్న ఒబెరాయ్ న్యూఢిల్లీ హోటల్‌లో కీలక బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా దేశాల ప్రతినిధులకు వసతి కల్పించారు.
లలిత్
కన్నాట్ ప్లేస్ సమీపంలోని లలిత్ న్యూఢిల్లీలో ఆఫ్రికా దేశాల ప్రతినిధి బృందాలు, బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానించిన ఇతర దేశాల ప్రతినిధులకు వసతి ఏర్పాటు చేశారు.
లే మెరిడియన్
విండ్సర్ ప్లేస్‌లోని లే మెరిడియన్ న్యూఢిల్లీ హోటల్ కూడా సదస్సు కోసం కీలక వేదికగా మారింది. అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ప్రపంచ పాలనా రంగానికి చెందిన ప్రముఖులు, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల ప్రతినిధులకు ఇక్కడ వసతి కల్పించారు.
షాంగ్రి-లా ఎరోస్ హోటల్
అశోకా రోడ్డులోని షాంగ్రి-లా ఎరోస్ హోటల్‌ను పశ్చిమ ఆసియా దేశాల ప్రతినిధి బృందానికి ప్రధాన వసతి కేంద్రంగా కేటాయించారు. సదస్సు నేపథ్యంలో ఆయా హోటళ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను కూడా భారీగా చేపట్టారు.
Also Read:
బ్రిక్స్ సదస్సుకు ముందు భారత్-రష్యా మధ్య భారీ డీల్..
ఆస్తి కోసం కొడుకు కుట్ర.. తల్లి కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరమన్న సుప్రీంకోర్టు..