నిరసనకారులపై బలప్రయోగాన్ని సమర్థించలేం: సీజేఐ సూర్యకాంత్
ABN , Publish Date - Jul 27 , 2026 | 05:06 PM
శాంతియుతంగా నిరసన తెలపడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారీ నిరసనల సందర్భంగా పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలపై దేశవ్యాప్తంగా ఒకే రకమైన మార్గదర్శకాలను రూపొందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: శాంతియుతంగా నిరసన తెలపడం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారీ నిరసనల సందర్భంగా పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలపై దేశవ్యాప్తంగా ఒకే రకమైన మార్గదర్శకాలను రూపొందించే అంశాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా తెలిపింది. ఈ మేరకు సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. సోమవారం పలు పిటిషన్లను విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. శాంతియుత ఆందోళన జరుగుతున్నంత మాత్రాన లాఠీఛార్జ్ వంటి బలప్రయోగానికి పాల్పడకూడదని, పోలీసుల నుంచి అధిక బలప్రయోగం జరిగితే స్వతంత్రంగా విచారణ జరగాలని వ్యాఖ్యానించింది.
నిరసనల్లో గాయపడిన ఆందోళనకారులు ఎంతముఖ్యమో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది భద్రత కూడా అంతే ప్రధానమని ధర్మాసనం పేర్కొంది. ప్రజలు, పోలీసులు ఇద్దరూ స్వీయ క్రమశిక్షణ పాటించినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని అభిప్రాయపడింది. నిరసనలను నియంత్రించేందుకు విధుల్లో ఉన్న పోలీసులకు తగిన రక్షణ పరికరాలు, హెల్మెట్లు, భద్రతా సామగ్రి అందించారా లేదా అనే విషయంపైనా రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ కోరే అంశాన్నీ పరిశీలిస్తామని తెలిపింది. ఆందోళనల సమయంలో పోలీసుల చర్యలపై దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రామాణిక విధానాలు(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్) అవసరమని పలువురు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. అనుమతి పొందిన ప్రదేశాల్లో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందంది. అయితే హింసకు పాల్పడిన సంఘ విద్రోహులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
కాగా.. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ఢిల్లీలోని పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు బలప్రయోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు, బిహార్‌లోని సివాన్‌లో పోలీసుల కాల్పుల ఆరోపణలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. వీటితోపాటు పోలీసులపైనా నిరసనకారులు దాడులకు పాల్పడ్డారని, వారి కుటుంబాల తరఫున కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశాలను సమగ్రంగా పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ అంశాలు ఒకే రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలన్న న్యాయస్థానం.. పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను ఈనెల 28న సమగ్రంగా విచారించాలని ఆదేశించింది. నిరసనకారులపై పోలీసుల అధిక బలప్రయోగం జరిగిందా? ఈ ఆందోళనల్లో హింసకు కారకులెవరు? అనే అంశాలపై నిష్పాక్షికంగా పరిశీలన చేపడతామని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు.. 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'లో మార్పులివే..
విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు.. కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు