25 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు.. సమాజ్వాది పార్టీ మేనిఫెస్టో విడుదల
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:01 PM
ఈరోజు సమాజ్వాది పార్టీ (ఎస్పీ) మేనిఫెస్టో విడుదలైంది. ఇందులో కీలక హామీలు ఏంటంటే..?
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్వాది పార్టీ (ఎస్పీ) తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉద్యోగకల్పన, సామాజిక సంక్షేమం, ఆర్థిక భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఆ పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది. ఇందులో.. నిరుద్యోగులందరికీ ప్రతినెలా రూ.5000 భృతి, ఆరేళ్లల్లో 25 లక్షలమంది యువతీయువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు, వయసు పైబడిన మహిళలకు రూ.40,000 వార్షిక పెన్షన్లు లాంటి ముఖ్యమైన హామీలు ఉన్నాయి. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం కాబట్టి.. ఈ మేనిఫెస్టోను ఎస్పీ ఈరోజే విడుదల చేసింది.
ఈ ఎన్నికల హామీల పత్రానికి ‘జన్-మన్ కా మేనిఫెస్టో’ అని సమాజ్వాది పార్టీ నామకరణం చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 25 లక్షలమందికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు 2 నుంచి 3 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో కులగణన నిర్వహిస్తామని చెప్పారు. యూపీ వ్యాప్తంగా సమాజ్వాది క్యాంటీన్లను తెరుస్తామని, వాటి ద్వారా రూ.5కే భోజనం అందిస్తామని వివరించారు. వయసు పైబడిన మహిళలకు రూ.40,000 వార్షిక పెన్షన్లు ఇస్తామని భరోసా కల్పించారు.
అచ్చే దిన్ రాలేదు..
కాగా మేనిఫెస్టో విడుదల కోసం రాజ్యాంగ దినోత్సవాన్ని తన పార్టీ ఎందుకు ఎంచుకుందో అఖిలేష్ యాదవ్ వివరించారు. ‘గతంలో మంచి రోజులు (అచ్చే దిన్) వస్తాయని బీజేపీ మోసం చేసింది. కానీ అవి రాలేదు. అందుకే వారిని గద్దె దించేందుకు మనం రాజ్యాంగ దినోత్సవం రోజు సమావేశమయ్యాం. ఇవాళే మన మేనిఫెస్టోను విడుదల చేశాం’అని ఆయన తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
అహంకారం వద్దు.. కలిసి పనిచేయాలి.. ఎస్పీతో సీట్ల పంచాయితీ వేళ ఖర్గే కీలక వ్యాఖ్యలు..
జాతీయ రహదారిపై విమానాల ల్యాండింగ్.. చరిత్ర సృష్టించిన భారత సైన్యం..