అహంకారం వద్దు.. కలిసి పనిచేయాలి.. ఎస్పీతో సీట్ల పంచాయితీ వేళ ఖర్గే కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:29 PM
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. రెండు పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. రెండు పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్‌ను ఉద్దేశించి పరోక్షంగా చురకలు అంటించారు. నాయకులు అహంకారాన్ని వీడి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు (Mallikarjun Kharge about Imran Masood).
నవంబర్ 26న లక్నోలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ సభలో ఖర్గే ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలను ఒక్కొక్కరినీ ప్రస్తావిస్తూ ఇమ్రాన్ మసూద్ గురించి మాట్లాడారు. ఇమ్రాన్ మసూద్ టీవీల్లో తరచూ కనిపిస్తారని, ఎంతో ఉత్సాహంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారని ఖర్గే అన్నారు. అయితే మాటల కంటే పనికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నాయకులంతా కలిసి పనిచేస్తేనే పార్టీ మరింత ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. పార్లమెంటులో ఇమ్రాన్ మసూద్ పార్టీ తరఫున గట్టిగా తన వాణిని వినిపిస్తున్నారని, కాంగ్రెస్ వైఖరిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు (Congress Samajwadi Party Alliance).
ఇదే ప్రసంగంలో ఖర్గే కీలక సూచనలు చేశారు (Congress SP Seat Sharing). ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు ఐక్యంగా ఉండాలని అన్నారు. విజయం సాధించాలంటే అంతర్గత విభేదాలకు తావివ్వకూడదని సూచించారు. నాయకులు అహంకారాన్ని పక్కనపెట్టి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాగా, సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకాల చర్చలపై ఇమ్రాన్ మసూద్ కొద్ది రోజులుగా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ వైఖరిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మేము మీ పొత్తు భాగస్వాములమా? లేక మీ సేవకులమా?' అంటూ ఎస్పీ నాయకత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఖర్గే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
అమెరికా వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..
అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..