అసెంబ్లీలో సీఎం విజయ్ గర్జన.. డీఎంకేకి స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:49 AM
తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి రాజకీయం ముదిరింది. ముఖ్యమంత్రి విజయ్ వర్సెస్ డీఎంకె యువనేత ఉదయనిధి స్టాలిన్ మధ్య జరిగిన మాటల యుద్ధం సభలో పెద్ద వివాదానికి దారితీసింది.
ఇంటర్నెట్ డెస్క్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రణరంగం ముదిరింది. కొత్త ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (TamilNadu CM Vijay) వర్సెస్ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) మధ్య జరిగిన మాటల యుద్ధం సభలో తీవ్ర వివాదానికి దారితీసింది. అవినీతి అంశంపై సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీ ఒక్కసారిగా హీటెక్కింది.
అవినీతిపై వదిలేదే లేదు..
అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ‘తమిళనాడులో అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే, ఎంతటి పెద్ద స్థానంలో ఉన్నా సరే.. వారిని వదిలే ప్రసక్తే లేదు’ అని సీఎం కుండబద్దలు కొట్టారు.
ఒకే కుటుంబం కాదు.. ప్రతి కుటుంబం మాదే..
అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒకే ఒక్క కుటుంబానికి (డీఎంకేను ఉద్దేశిస్తూ..) ప్రాధాన్యం ఇవ్వడం తమ రాజకీయ విధానం కాదని సీఎం విజయ్ గట్టి చురకలు అంటించారు. తమిళనాడులోని ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అదే తమ అసలైన పాలనా విధానమని సీఎం విజయ్ స్పష్టం చేశారు.
విజయ్ ప్రసంగాన్ని అడ్డుకున్న డీఎంకే..
ముఖ్యమంత్రి విజయ్ నేరుగా గత పాలకులను టార్గెట్ చేస్తూ అవినీతి వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్ష డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే ఎమ్మెల్యేలు సీఎం విజయ్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ నినాదాలు చేశారు. కేవలం రాజకీయ కక్షతో, బురదజల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి జరిగి ఉంటే దానికి సంబంధించిన పక్కా ఆధారాలను సభ ముందు ఉంచాలని ఉదయనిధి స్టాలిన్ గట్టిగా డిమాండ్ చేశారు.
రాజకీయాలు ఇంత క్రూరమా?..
ఎన్నికల ప్రచారంలో జరిగిన దురదృష్టకర కరూర్ తొక్కిసలాట ఘటనపై సీఎం విజయ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘41 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఆ విషాదం నన్ను ఎంతగానో కలచివేసింది. ఆ బాధ నా గుండెల్లోంచి ఎప్పటికీ పోదు’ అని ఆవేదన చెందారు. ఈ ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తూ తమపైనే నిందలు వేయడంపై ధ్వజమెత్తారు. ‘రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా?’ అని సీఎం సభలో ప్రశ్నించారు.
అప్పుడే విమర్శలా?..
డీఎంకే సభ్యుల నిరసనలు, గందరగోళం మధ్యే సీఎం విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ విపక్షాల విమర్శలపై ఘాటుగా స్పందించారు. ‘మేం అధికారంలోకి వచ్చి కేవలం కొన్ని రోజులే అవుతోంది. అప్పుడే మా ప్రభుత్వంపై విమర్శలు, బురదజల్లడం ఏంటి?’ అని విజయ్ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి కనీస సమయం ఇవ్వాలని, ప్రజలు ఆశించిన అవినీతి రహిత మార్పును క్షేత్రస్థాయిలో కచ్చితంగా చూపించి తీరుతామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రంతో సయోధ్యగానే ఉంటాం..
కేంద్ర ప్రభుత్వంతో తమ ప్రభుత్వ బంధం ఎలా ఉండబోతోందనే దానిపై సీఎం విజయ్ కీలక ప్రకటన చేశారు. తమిళనాడు అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంతో తాము సయోధ్యగానే ఉంటామని స్పష్టం చేశారు. అయితే, సిద్ధాంతపరంగా మాత్రం తాము బీజేపీ విధానాలను, వారి ఐడియాలజీని పూర్తిగా వ్యతిరేకిస్తామని సీఎం విజయ్ సభలో తేల్చిచెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ అభివృద్ధిపై కీలక చర్చలు
కేటీఆర్ సినిమా డైలాగులు మానుకోవాలి.. ప్రజల కోణంలో మాట్లాడాలి: ఎంపీ చామల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News