Share News

మధ్య ఆసియాపై భారత్‌ ఫోకస్‌.. మోదీ కీలక పర్యటన

ABN , Publish Date - Aug 29 , 2026 | 10:21 AM

మధ్య ఆసియాలో భారత్‌ వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారు. అందులో భాగంగా నాలుగు రోజుల పాటు ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌లలో పర్యటించనున్నారు.

మధ్య ఆసియాపై భారత్‌ ఫోకస్‌.. మోదీ కీలక పర్యటన

ఇంటర్నెట్ డెస్క్: మధ్య ఆసియాలో భారత్‌ వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల పర్యటనకు శనివారం శ్రీకారం చుట్టనున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 1 వరకు ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌లలో ఆయన పర్యటించనున్నారు. తొలుత తాష్కెంట్‌ చేరుకోనున్న మోదీ.. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్‌కత్‌ మిర్జియోయెవ్‌తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. అనంతరం బిష్కెక్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) 26వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.


మోదీ ఉజ్బెకిస్థాన్‌‌లో పర్యటించడమిది నాలుగోసారి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగనున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్‌ అనుసంధానం, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ఇరుదేశాల నేతలు సమీక్షించనున్నారు. భారత్‌ 'వికసిత్‌ భారత్‌ 2047', ఉజ్బెకిస్థాన్‌ 'ఉజ్బెకిస్థాన్‌-2030' అభివృద్ధి లక్ష్యాల మధ్య సహకారానికి ఉన్న అవకాశాలపైనా చర్చించనున్నారు. కాగా.. మధ్య ఆసియాలో భారత్‌కు ఉజ్బెకిస్థాన్‌ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. వాణిజ్యం, ఇంధనం, ఆరోగ్యం, ఔషధాలు, వ్యవసాయం, రసాయనాలు, యంత్ర పరికరాలు తదితర రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.


ఈ పర్యటనలో భాగంగా తాష్కెంట్‌లోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి స్మారకాన్ని, మహాత్మా గాంధీ కేంద్రాన్ని మోదీ సందర్శించనున్నారు. ఆ తర్వాత కిర్గిజిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌‌కు వెళ్లనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1న జరిగే ఎస్‌సీఓ సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు. భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే మూడు అంశాలను భారత్‌ కీలకంగా ప్రస్తావించనున్నారు. ఈ ఏడాది 25వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ఎస్‌సీఓలో.. భారత్‌ 2017 నుంచి పూర్తి సభ్యదేశంగా కొనసాగుతోంది. ఈ సదస్సు సందర్భంగా పలు దేశాధ్యక్షులతో ద్వైపాక్షిక భేటీలూ జరిగే అవకాశముంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో మోదీ సమావేశం కూడా ఖరారైనట్లు సమాచారం.


ఇవీ చదవండి:

భారత్‌కూ అదే ముప్పు

చావుకి బతుక్కి మధ్య..!

Updated Date - Aug 29 , 2026 | 10:38 AM