ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ బాంబ్.. తమిళనాడులో యువకుడి అరెస్ట్
ABN , Publish Date - Sep 04 , 2026 | 03:37 PM
తన ప్రియురాలు వారం రోజులుగా మాట్లాడకపోవడాన్ని తట్టుకోలేని ఓ ప్రేమోన్మాది ఆమె ఇంటిపై పెట్రోల్ బాంబ్ విసిరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తన ప్రియురాలు వారం రోజులుగా మాట్లాడడం లేదని ఓ ప్రేమోన్మాది ఆగ్రహించాడు. ప్రియురాలి ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబ్‌తో దాడి చేశాడు. ఈ తతంగమంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో ఈ రోజు(శుక్రవారం) పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు మధురైకి చెందిన నాగార్జున అనే 23 ఏళ్ల యువకుడు ఓ యువతితో ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అయితే వారి మధ్య స్వల్ప ఘర్షణ తలెత్తడంతో ఆ యువకుడితో ఆమె వారం రోజుల నుంచి మాట్లాడడం లేదని సమాచారం. ఈ విషయం తట్టుకోలేక మనస్తాపం చెందిన అతడు.. మద్యం సేవించి, ప్రియురాలి ఇంటిపై పెట్రోల్ బాంబ్ విసిరాడు. ఆ బాంబ్ పేలి ప్రమాదవశాత్తూ అగ్ని జ్వాలలు అతడిపైనే పడ్డాయి. దీంతో వెంటనే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన మొత్తం స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచామని తెలిపారు. దర్యాప్తు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.
అయితే.. ఆ రాష్ట్ర అసెంబ్లీలో మహిళల భద్రతపై ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య వాడీవేడిగా చర్చ జరిగిన తరువాతి రోజే ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి విజయ్ పాలనలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయిందని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 116 రోజుల్లోనే 200 మర్డర్లు జరిగాయన్నారు. అయితే వీటిపై విజయ్ స్పందిస్తూ.. ప్రతి ప్రశ్నకూ తాను వచ్చే సోమవారం సమాధానమిస్తానని అన్నారు.
ఇవీ చదవండి:
తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు
చెన్నైలో 'ఒలింపిక్ సిటీ'.. ఫార్ములా-1 ట్రాక్.!