Share News

విశ్వాసానికి ప్రతిబింబం.. మెలోనికి మోదీ అభినందనలు

ABN , Publish Date - Sep 04 , 2026 | 02:35 PM

ఇటలీ యుద్ధానంతర చరిత్రలో జార్జియా మెలోని ప్రభుత్వం అత్యధిక కాలం నిరంతరాయంగా అధికారంలో ఉన్న ప్రభుత్వంగా అవతరించిన సందర్భాన్ని పురస్కరించకుని, ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

విశ్వాసానికి ప్రతిబింబం.. మెలోనికి మోదీ అభినందనలు
PM Modi Congratulates Giorgia Meloni on Longest Serving PM Record

ఢిల్లీ, సెప్టెంబర్ 4: ఇటలీ రాజకీయ చరిత్రలో ప్రధాని జార్జియా మెలోని నూతన అధ్యాయాన్ని లిఖించారు. రెండో ప్రపంచ యుద్ధం (Post-war) తర్వాత ఇటలీలో అత్యంత సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా పాలించిన ప్రధానమంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. 1,413 రోజుల పాటు నిరంతరంగా పదవిలో కొనసాగడం ద్వారా, గతంలో సిల్వియో బెర్లుస్కోనీ నేతృత్వంలోని ప్రభుత్వం (2001-2005) పేరిట ఉన్న 1,412 రోజుల రికార్డును మెలోని దాటేశారు.


ఈ చరిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి సోషల్ మీడియా వేదికగా (X) ప్రత్యేక అభినందనలు తెలిపారు. 'ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యధిక కాలం నిరంతరాయంగా పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచిన నా మిత్రురాలు, ప్రధానమంత్రి మెలోనికి అభినందనలు. ఈ మైలురాయి ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న నమ్మకానికి, విశ్వాసానికి ప్రతిబింబం' అని ప్రధాని మోదీ Xలో పోస్ట్ చేశారు.

దౌత్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో మెలోని వ్యూహాత్మక సహకారాన్ని నొక్కిచెబుతూ ప్రధాని మోదీ.. 'భారత్-ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆమె స్నేహం కూడా కీలక పాత్ర పోషించింది. మన ఇరు దేశాల ప్రజల కోసం ఒక సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించడానికి, మన సన్నిహిత సహకారాన్ని కొనసాగించడానికి ఎదురుచూస్తున్నాను'. రాబోయే సంవత్సరాల్లో ఆమె నిరంతర విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని మోదీ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.


రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గత 80 ఏళ్లలో దాదాపు 68 ప్రభుత్వాలు మారిన ఇటలీ రాజకీయాల్లో, ఒక ప్రభుత్వం పూర్తికాలం స్థిరంగా కొనసాగడం అత్యంత అరుదైన విషయం. అటువంటి రాజకీయ వాతావరణంలో అక్టోబర్ 2022లో ఇటలీ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మెలోని, అత్యంత స్థిరమైన పాలనను అందిస్తూ ఈ మైలురాయిని చేరుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతం.. భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు

ఈ ఏడాది తొలి విజయం.. జీఎస్ఎల్‌వీ-ఎఫ్17 మిషన్: ఇస్రో చైర్మన్ నారాయణన్

For More National News And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 02:52 PM