Share News

చెన్నైలో 'ఒలింపిక్ సిటీ'.. ఫార్ములా-1 ట్రాక్.!

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:29 PM

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నగరాన్ని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికను ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్.

చెన్నైలో 'ఒలింపిక్ సిటీ'.. ఫార్ములా-1 ట్రాక్.!
CM Vijay

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నగరాన్ని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సెంటర్‌గా తీర్చిదిద్దే దిశగా ముందడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలోని 110వ నిబంధన కింద ఒలింపిక్ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం జోసెఫ్ విజయ్ ప్రకటించారు. రాష్ట్ర క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో ప్రపంచ స్థాయి క్రీడా వేదికలు, ఆధునిక శిక్షణ పరికరాలు, హై పర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ కేంద్రాలు వంటివాటిని నిర్మించనున్నట్టు పేర్కొన్నారు.


అంతేకాకుండా క్రీడాకారులు, కోచ్‌ల కోసం వసతి సదుపాయాలతో కూడిన సమగ్ర క్రీడా కేంద్రంగానూ చెన్నైని అభివృద్ధి చేయనున్నట్టు తెలుస్తోంది. దేశంలోకి ఫార్ములా వన్ రేసింగ్‌ను తిరిగి తీసుకురావడం సహా అంతర్జాతీయ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించేలా అత్యుత్తమ శిక్షణ, సహాయక సదుపాయాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. '2028 నాటికి భారత్‌లోకి ఎఫ్-1ను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఇందుకోసం దేశంలో మోటార్ స్పోర్ట్స్‌ను పర్యవేక్షించి, మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించేందుకు ఓ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటుచేశాం' అని యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.


అదే సమయంలో చెన్నైలో ప్రత్యేకంగా మోటార్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేసి ఫార్ములా-1 నుంచి ఎఫ్-4 వరకు రేసులు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. భారత్‌లో 2030 నాటికి ఫార్ములా-1 రేస్, 2028 నాటికి వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో ఒక రౌండ్ సహా మోటోజీపీని నిర్వహించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టినట్టు ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎమ్ఎస్‌సీఐ) ప్రెసిడెంట్ అరిందమ్ ఘోష్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.


ఇవీ చదవండి:

అభిషేక్ బెనర్జీ కార్యాలయంపై దుండగుల దాడి! షాకింగ్ వీడియో

యాసిన్ మాలిక్ సంచలన నిర్ణయం.. సరళా భట్ హత్య కేసులో కీలక ప్రకటన

Updated Date - Sep 03 , 2026 | 05:38 PM