యాసిన్ మాలిక్ సంచలన నిర్ణయం.. సరళా భట్ హత్య కేసులో కీలక ప్రకటన
ABN , Publish Date - Sep 03 , 2026 | 01:21 PM
మూడు దశాబ్దాల నాటి ఓ సంచలన హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తిహార్ జైలులో ఉన్న యాసిన్ మాలిక్.. 1990లో కశ్మీరీ పండిట్ నర్సు సకళా భట్ హత్య కేసులో ఇకపై విచారణను వ్యతిరేకించబోనని కోర్టుకు లిఖితపూర్వకంగా వెల్లడించారు. తనకు మరణశిక్ష విధించే అంశాన్ని పరిశీలించవచ్చంటూ చేసిన ఈ ప్రకటనతో కేసు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది..
ఇంటర్నెట్ డెస్క్: తిహార్ జైలులో ఉన్న వేర్పాటువాద నాయకుడు.. నిషేధిత జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) అధినేత యాసిన్ మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1990లో కశ్మీరీ పండిట్ నర్సు సరళా భట్ హత్య కేసు విచారణను ఇకపై తాను వ్యతిరేకించబోనని శ్రీనగర్‌లోని అదనపు సెషన్స్ కోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపారు. తనకు మరణశిక్ష విధించే అంశాన్ని కోర్టు పరిశీలించవచ్చని పేర్కొంటూ 25 పేజీల వాంగ్మూలాన్ని తన న్యాయవాది అబు ఆదిల్ పండిట్ ద్వారా దాఖలు చేశారు. అయితే.. ఈ నిర్ణయాన్ని నేరాన్ని అంగీకరించినట్లుగా భావించరాదని మాలిక్ స్పష్టం చేశారు. రాజకీయ పరిస్థితుల కారణంగా తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని పేర్కొన్న ఆయన.. చాలా ఆలోచించిన తర్వాత, ‘ఇస్తిఖారా’ ప్రార్థన చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేసు తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 19కి వాయిదా వేసింది.
ఇదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా మాలిక్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తానీ కళాకారిణి ముషాల్ హుస్సేన్ ముల్లిక్‌తో తన 16 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 2009లో వీరిద్దరూ వివాహం చేసుకోగా.. వారికి రజియా సుల్తానా అనే 13 ఏళ్ల కుమార్తె ఉంది. తన కుమార్తె రజియా తన తల్లి, అమ్మమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని, కష్టకాలంలో కుటుంబం తనకు అండగా ఉందనే భావన కలిగేలా ప్రతిరోజూ ఆమెతో కొంత సమయం మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

సర్లా భట్ హత్య కేసు మూడు దశాబ్దాలకు పైగా నాటి కీలకమైన కేసుగా ఉంది. షేర్-ఎ-కాశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SKIMS)లో స్టాఫ్ నర్సుగా పనిచేసిన కశ్మీరీ పండిట్ సర్లా భట్ 1990 ఏప్రిల్‌లో ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలో అపహరణకు గురయ్యారు. కొద్ది రోజుల తర్వాత ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన కశ్మీరీ పండిట్ సమాజంలో తీవ్ర భయాందోళనలకు దారితీసింది. చాలా కాలం పాటు పరిష్కారం కాని ఈ కేసును 2025లో జమ్మూ కశ్మీర్ పోలీసుల స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA) తిరిగి తెరిచింది.
ఈ క్రమంలో యాసిన్ మాలిక్‌తో పాటు కేసుతో సంబంధం ఉన్న పలువురి ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి, చార్జిషీట్‌లో మాలిక్, ఖుర్షీద్ అహ్మద్ చల్కు, అబ్దుల్ హమీద్ షేక్, మహమ్మద్ యూసుఫ్ సోఫీ, గులాం మహమ్మద్ తప్లూ పేర్లను చేర్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఖుర్షీద్ అహ్మద్ చల్కు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పేర్కొనగా, మహమ్మద్ యూసుఫ్ సోఫీ, అబ్దుల్ హమీద్ షేక్, గులాం మహమ్మద్ తప్లూ మరణించారు. దీంతో జీవించి ఉన్న ప్రధాన నిందితుడిగా యాసిన్ మాలిక్ మిగిలారు. ప్రస్తుతం తిహార్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న మాలిక్.. జమ్మూలో వేరొక హత్య కేసులో కూడా విచారణను ఎదుర్కొంటున్నాడు.
ఇవి కూడా చదవండి...
గంజాయి డాన్ నీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు
రెండు చక్రాలపై ఆటో డ్రైవర్ ప్రమాదకర స్టంట్..
Read Latest Telangana News And Telugu News