నేహా గురించి తెగ వెతికిన నెటిజన్లు
ABN , Publish Date - Oct 12 , 2026 | 09:14 PM
నేహా బోరా.. నేహా బోరా.. గూగుల్‌లో ట్రెండ్ అయిన పేరు ఇది. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ద్వారా ఓట్ చోరీకి పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.
ఇంటర్‌నెట్ డెస్క్: నేహా బోరా.. నేహా బోరా.. గూగుల్‌లో ట్రెండ్ అయిన పేరు ఇది. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ద్వారా ఓట్ చోరీకి పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో భాగంగా ఒక పోలీసు వ్యాన్‌ను అడ్డుకోవడానికి యత్నించిన ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమెనే నేహా బోరా. లెఫ్ట్ వింగ్‌కు చెందిన విద్యార్థి విభాగం ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ)కు ఆమె జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. జంతర్ మంతర్ వద్ద ప్రదర్శనకు వెళ్తుండగా.. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన మద్దతుదారులతో మాట్లాడారు.
పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత గూగుల్‌లో నెటిజన్లు నేహా గురించి విస్తృతంగా వెతికారు. ఆమె చదువు, వయసు, ఊరు, తండ్రి పేరు ఎవరో తెలుసుకునేందుకు గూగుల్‌లో వెతికారు. కాగా.. నేహాది ఉత్తరాఖండ్‌లోని ఖతిమా నగరం. బెంగాల్‌లోని సిలిగురిలో పాఠశాల విద్య పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలోని హిందూ కాలేజీలో సోషియాలజీ చదివారు. తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఢిల్లీలో పీజీ పూర్తిచేశారు. అలాగే జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీతోనూ ఆమెకు అనుబంధం ఉంది. ఆ వర్సిటీలో థియేటర్ అండ్ పర్ఫార్మెన్స్ స్టడీస్‌లో డాక్టోరల్ రీసెర్చ్ చేశారు. 2019, 2020లో పౌరసత్వ సవరణ చట్టానికి జరిగిన విద్యార్థి ఆందోళనలకు నేహా బోరా నేతృత్వం వహించారు. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) లో చేరిన తర్వాత క్రమంగా ఆ అసోసియేషన్‌కు జాతీయ అధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం సీజేపీ ఆందోళనలు, నిరసన ప్రదర్శనల ద్వారా ఆమె పేరు విస్తృతంగా ట్రెండ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్
ఢిల్లీలో ఇండియా కూటమి నేతల పాదయాత్ర ప్రారంభం
మెట్రో ప్రయాణికుడి మృతి.. మాజీ ఐఏఎస్ అధికారి అరెస్టు