నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు
ABN , Publish Date - Jul 30 , 2026 | 09:01 AM
నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ఒక్కసారి భౌతిక హాజరు విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.
ఢిల్లీ, జులై 30 (ఆంధ్రజ్యోతి): నీట్ యూజీ (NEET-UG) కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం (Central Government) విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. విద్యార్థులకు సౌకర్యంగా ఉండేలా ఒక్కసారి భౌతిక హాజరు (One-time Physical Reporting) విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో ప్రతి కౌన్సెలింగ్ రౌండ్‌కు కాలేజీకి వెళ్లాల్సిన అవసరం ఉండదని కేంద్రం తెలిపింది. ఒకసారి కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ పూర్తి చేస్తే, తదుపరి ప్రక్రియలు ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
కొత్త విధానం ప్రకారం, సీటు అప్‌గ్రేడ్ కోరుకునే అభ్యర్థులు ఇకపై కాలేజీలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే తాత్కాలిక ప్రవేశం (Provisional Admission) కూడా డిజిటల్ విధానంలో పొందవచ్చని వివరించింది. మెరుగైన సీటు వచ్చినప్పుడు, అభ్యర్థికి కేటాయించిన పాత సీటు ఆటోమేటిక్‌గా తదుపరి అభ్యర్థికి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.
అయితే, తమకు వచ్చిన సీటును ఖరారు చేసుకోవాలనుకునే (Freeze) అభ్యర్థులు మాత్రమే సంబంధిత కాలేజీకి వెళ్లి అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే విద్యార్థులకు MCC పోర్టల్ ద్వారా నేరుగా సీటును వదులుకునేందుకు (Online Resignation) అవకాశం కల్పించినట్లు వెల్లడించింది.
విదేశాల్లో నివసించే భారతీయులు (NRI) ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించేందుకు వారి పత్రాల పరిశీలన కోసం ప్రత్యేక డిజిటల్ పోర్టల్‌ను కూడా ప్రారంభించినట్లు తెలిపింది. దీంతో NRI అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరింత వేగంగా, పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది.
దివ్యాంగ అభ్యర్థులకు కూడా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మెడికల్ అసెస్మెంట్ కేంద్రాల సంఖ్యను 16 నుంచి 61కి పెంచింది. దీనివల్ల దివ్యాంగ విద్యార్థులకు ధ్రువీకరణ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
నీట్ యూజీ కౌన్సెలింగ్‌కు సంబంధించిన సందేహాల పరిష్కారం కోసం కేంద్రం ప్రత్యేక సహాయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. విద్యార్థులు 1800-102-7637 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా mcc2026@gov.in ఇమెయిల్ ద్వారా సహాయం పొందవచ్చు.
ఈ కొత్త మార్పులతో నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు, విద్యార్థుల సమయం, ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి. డిజిటల్ విధానాల విస్తరణతో వైద్య విద్య ప్రవేశ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
వార్తలు కూడా చదవండి...
చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి
జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్
ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News