ప్రధాన్ రాజీనామాపై పార్లమెంట్‌లో ప్రతిష్ఠంభన
ABN , Publish Date - Jul 24 , 2026 | 02:24 PM
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రతిపక్ష పార్టీల నేతలు శుక్రవారం పార్లమెంట్ భవన ప్రాంగణంలో నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఉభయ సభల్లో పేపర్ లీక్ అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: నీట్ యూజీ సహా దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న పరీక్షల పేపర్ లీక్ వ్యవహారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సహా ప్రధాని నరేంద్ర మోదీ సభాముఖంగా క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. ఈ అంశంపై చర్చకు ముందుగా మంత్రి ప్రధాన్ తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు.
ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలోని మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. 'ప్రధాన్‌ను తొలగించాలి' అనే బ్యానర్లతో నినాదాలు చేశారు. లోక్‌సభ, రాజ్యసభల్లో పేపర్ లీక్‌లపై చర్చ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్‌సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12:00 గంటల వరకు వాయిదా పడింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రతిష్ఠంభన కొనసాగింది. మరోవైపు.. పరీక్షల పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠిన శిక్షలు విధించేలా కొత్త బిల్లును తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తుది రూపుదిద్దిన తర్వాత ఆ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతామన్నారు. ఈ విషయమై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. నీట్ అంశంపై సభలో చర్చ జరగాల్సిన అవసరముందన్నారు.
మరోవైపు.. విద్యార్థులపై జులై 20న జరిగిన పోలీస్ చర్యలో పెల్లెట్ గన్స్ వినియోగించారని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ అంశాన్నీ పార్లమెంట్‌లో లేవనెత్తనున్నట్లు పార్టీ రాజ్యసభ ఉపనేత సాగరికా ఘోష్ వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో స్పీకర్.. లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో వందేమాతరం బిల్లు..
వందేమాతరం గేయానికి చట్టబద్ధ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభలో 'వందేమాతరం బిల్లు'ను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ గేయాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించే వారికి జైలుశిక్ష సహా ఇతర శిక్షలు విధించేలా, అలాగే గేయాన్ని పూర్తిగా ఆలపించాల్సిందేననే నిబంధనలనూ ఇందులో పొందుపరిచారు. అయితే.. ఈ బిల్లుపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ సభలోనే ఆందోళనకు దిగారు. బిల్లు వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రాజ్యసభ కార్యకలాపాలను సభాపతి సోమవారానికి వాయిదా వేశారు.
ఇవీ చదవండి:
విద్యార్థులను దేశద్రోహులుగా చూస్తున్నారు.. కేంద్రంపై సోనియా గాంధీ ధ్వజం
26 రోజుల నిరాహార దీక్షకు విరమణ.. 'ఆకలి రుచే వేరు' అని వ్యాఖ్య