విద్యార్థులను దేశద్రోహులుగా చూస్తున్నారు.. కేంద్రంపై సోనియా గాంధీ ధ్వజం
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:21 AM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. విద్యా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, విద్యార్థుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు.
ఢిల్లీ, జులై 24 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) సంచలన ఆరోపణలు చేశారు. విద్యా వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, విద్యార్థుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు సోనియాగాంధీ ఓ ప్రకటన విడుదల చేశారు.
152 పేపర్ లీక్ ఘటనలు..
విద్యా వ్యవస్థలో తీవ్రమైన వైఫల్యాలు వెలుగులోకి వచ్చినప్పటికీ సదరు కేంద్ర మంత్రి బాధ్యత వహించకుండా పదవిలో ఇంకా కొనసాగుతున్నారని సోనియా గాంధీ ధ్వజమెత్తారు. గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా 152 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ప్రస్తావించారు. జాతీయ పరీక్షల నిర్వహణ వ్యవస్థలో లోపాలపై మోదీ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహణను ఉంచడం వల్లే ఈ పరీక్షల విశ్వసనీయత దెబ్బతిందని ఆరోపించారు. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాలు అవసరమని పేర్కొన్నారు.
టియర్ గ్యాస్ ప్రయోగించడం దురదృష్టకరం..
విద్యార్థుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కూడా సోనియా గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువతను దేశ భవిష్యత్తుగా చూడాల్సిందిపోయి దేశద్రోహులుగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. జులై 20వ తేదీన విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలోనే జరిగిందని ఆరోపించారు. అలాగే మోదీ హయాంలో పాఠశాల విద్యకు 50 శాతం, ఉన్నత విద్యకు 33 శాతం మేర బడ్జెట్ తగ్గించారని సోనియా గాంధీ దుయ్యబట్టారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయాల్సిన సమయంలో మోదీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సోనియాగాంధీ ఆగ్రహించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విద్యార్థులపై లాఠీఛార్జ్ కాదు.. కేంద్రం సమాధానమివ్వాలి: కమల్ హాసన్
రాష్ట్రాలను నమ్మండి.. నీట్‌ను రద్దు చేయండి: స్టాలిన్
ఉదయ్ కృష్ణారెడ్డి కేసు.. మహిళా ట్రైనీ ఐపీఎస్ స్టేట్‌మెంట్ రికార్డ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News