ఢిల్లీలో సీజేపీ ఆందోళనలు.. పాక్ సోషల్ మీడియా అకౌంట్లతో తప్పుడు ప్రచారం!
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:27 AM
ప్రస్తుత సీజేపీ ఆందోళనల నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన 480కి పైగా సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు.
ప్రస్తుత సీజేపీ (CJP) ఆందోళనల నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన 480కి పైగా సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ఈ ఖాతాల ద్వారా వదంతులు, నకిలీ పోస్టులు, ఎడిట్ చేసిన వీడియోలను వ్యాప్తి చేసి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఈ ఖాతాలను గుర్తించి బ్లాక్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు (Pakistan social media handles).
తాజాగా గుర్తించిన ఈ ఖాతాల ద్వారా 'ఆపరేషన్ సిందూర్' సమయంలో కూడా తప్పుడు సమాచారం ప్రచారమైందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా, అధికారిక వర్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించారు. ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిన కనీసం 18 తప్పుడు ప్రచారాలను ఇప్పటికే ఖండించామని తెలిపారు (Delhi Police On CJP protests).
నిరసనకారులపై పోలీసులు దాడి చేశారని, ఓ బాలిక మరణించిందని, కొందరు నాయకులను అదుపులోకి తీసుకున్నారని, గోళీలు లేదా మేకులు అమర్చిన లాఠీలు వాడారని వచ్చిన ప్రచారాలు వాస్తవం కాదని పోలీసులు స్పష్టం చేశారు (Fake news). సోషల్ మీడియాలో వచ్చే సందేశాలు, వీడియోలు లేదా పోస్టులను నిజానిజాలు తెలుసుకోకుండా ఫార్వర్డ్ చేయొద్దని, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం సృష్టించడం లేదా ప్రచారం చేయడం చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
ఇరాక్ ద్వారా అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన.. తిరస్కరించిన ఇరాన్..
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..