Share News

టైగర్‌పై కాల్పుల కేసు.. మరో వ్యక్తిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు

ABN , Publish Date - Oct 21 , 2026 | 06:03 PM

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులో ముంబై పోలీసులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిని గుజరాత్‌లోని బరోడాలో అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని అంకిత్‌గా గుర్తించారు.

టైగర్‌పై కాల్పుల కేసు.. మరో వ్యక్తిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు

ఇంటర్‌నెట్ డెస్క్: బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులో ముంబై పోలీసులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిని గుజరాత్‌లోని బరోడాలో అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని అంకిత్‌గా గుర్తించారు. అతడిని అరెస్టు చేసిన తర్వాత హర్యానాలోని గోహానా కోర్టులో హాజరుపరిచారు. తర్వాత ట్రాన్సిట్ రిమాండ్‌పై ముంబైకి తరలించారు. గోహానా పోలీసులు, ముంబై పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి అంకిత్‌ను అరెస్టు చేశారు.


లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో సంబంధాలపై ఆరా

లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు సన్నిహితుడిగా పేరున్న అనిల్‌ పండిట్‌తో అంకిత్‌కు సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించిన కుట్రలో అంకిత్‌ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంకిత్‌, నేపాల్‌, అనిల్‌ పండిట్‌ల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ లావాదేవీల వెనుక ఉన్న కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌తో అంకిత్‌కు ఉన్న సంబంధాలు, కుట్రలో అతడి పాత్రపై మరింత లోతుగా విచారణ జరపనున్నారు.


కోటా నుంచి ముంబైకి ముగ్గురు నిందితులు

టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పుల ఘటనలో కీలక నిందితులుగా భావిస్తున్న ముగ్గురిని బుధవారం రాజస్థాన్‌లోని కోటా నుంచి ముంబైకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. కోటా నుంచి రోడ్డు మార్గంలో ముంబైకి తరలించిన అనంతరం వైద్య పరీక్షల కోసం వారిని జీటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక విచారణ కోసం ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌లోని యాంటీ ఎక్స్‌టార్షన్‌ సెల్‌ (ఏఈసీ) కార్యాలయానికి తరలించారు. కాగా.. నిందితులను హర్యానాలోని సోనిపట్‌కు చెందిన రెహాన్‌ అలియాస్‌ సుక్కా, బిహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన రితిక్‌ కుర్మీ అలియాస్‌ రోషన్‌, హర్యానాకు చెందిన ఫూల్‌ సింగ్‌గా గుర్తించారు. కోటా నగర పోలీసులు వీరిని ముంబై పోలీసులకు అప్పగించగా, ముంబై పోలీసులు అధికారికంగా అరెస్టు చేసి స్థానిక మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. నిందితులను ముంబైకి తరలించేందుకు కోర్టు ట్రాన్సిట్‌ రిమాండ్‌ మంజూరు చేసింది. మరోవైపు నిందితుల తరఫున వాదనలు వినిపించేందుకు అజింక్య మిర్గల్‌ అనే అడ్వొకేట్ బుధవారం ఉదయం ఏఈసీ కార్యాలయానికి చేరుకున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎగిరే కారు శాంపిల్ మాత్రమే.. ఎలాన్ మస్క్ ఏం ప్లాన్ చేశారంటే..?

టెస్లా రోడ్‌స్టర్ కారు గాల్లో ఎగరడం వెనుక అసలు రహస్యం ఏంటి?

Updated Date - Oct 21 , 2026 | 06:03 PM