Share News

టైగర్ ష్రాఫ్ కాదు.. అసలు టార్గెట్ సల్మాన్!

ABN , Publish Date - Oct 21 , 2026 | 09:47 AM

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌‌పై కాల్పుల ఉదంతం మరో మలుపు తిరిగింది. తాము మొదట నటుడు సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేశామని నిందితులు పోలీసులకు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

టైగర్ ష్రాఫ్ కాదు.. అసలు టార్గెట్ సల్మాన్!
Tiger Shroff firing case

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌‌పై కాల్పుల ఉదంతం మరో మలుపు తిరిగింది. తాము మొదట నటుడు సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేశామని నిందితులు పోలీసులకు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కేసుకు సంబంధించి హర్యానాకు చెందిన ఇద్దరు షూటర్లను, బిహార్‌కు చెందిన మరొకరిని రాజస్థాన్‌లో పోలీసులు అరెస్టు చేసి ముంబైకి తరలించారు. అంతేకాకుండా, హర్యానాకు చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు షూటర్లకు ఆయుధాలను సరఫరా చేసినట్టు తెలుస్తోంది. విచారణ సమయంలో నిందితులు కునాల్ అనే వ్యక్తి గురించి చెప్పడంతో అతడినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ.. సోషల్ మీడియా చెక్ చేసి..

మీడియా కథనాల ప్రకారం, ముగ్గురు షూటర్లు మొదట నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. అయితే, సల్మాన్ ఇంటి ముందు పోలీసు బందోబస్తు పటిష్ఠంగా ఉండటంతో వెనక్కు తగ్గారు. మరో సులువైన టార్గెట్ కోసం వెతుకుతుండగా వారి దృష్టి టైగర్ ష్రాఫ్‌పై పడింది. ప్రతి ఆదివారం ఆయన జుహూ ప్రాంతంలోని ఫుట్ బాల్ గ్రౌండ్‌కు వస్తారని అభిమానుల ఫేస్‌బుక్ పేజీ ద్వారా తెలుసుకున్నారు. అక్కడ భద్రత కూడా తక్కువగా టుందని గ్రహించి ఆదివారం సాయంత్రం టైగర్ ష్రాఫ్‌ను టార్గెట్ చేశారు.


చెప్పినా వినలేదు.. అందుకే..

టైగర్ ష్రాఫ్‌పై కాల్పులకు తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిట్, హర్మన్ సంధూ ప్రకటించారు. సల్మాన్‌తో పని చేసిన వారందరూ తమ టార్గెట్‌ అని వార్నింగ్ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్‌కు అంతకుముందే కాల్ చేసి హెచ్చరించినా వినిపించుకోలేదని చెప్పారు. దీంతో, విషయం అర్థమయ్యేలా మరోసారి చెప్పామని వ్యాఖ్యానించారు.


ఈ వార్తలనూ చదవండి:

సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా కేసు క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగింత!

ఆత్మనిర్భర్ భారత్ సాధనే మన లక్ష్యం కావాలి: ప్రధాని మోదీ

Updated Date - Oct 21 , 2026 | 09:47 AM