Share News

ఆత్మనిర్భర్ భారత్ సాధనే మన లక్ష్యం కావాలి: ప్రధాని మోదీ

ABN , Publish Date - Oct 20 , 2026 | 07:29 PM

ఆత్మనిర్భరత సాధన కోసం ఏకతాటిపైకి రావాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన భారత్, ఆత్మనిర్భర్ భారత్ సాధనే మన లక్ష్యం కావాలని అన్నారు. దేశ గౌరవాన్ని దెబ్బతీసి, సమాజాన్ని విభజించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

ఆత్మనిర్భర్ భారత్ సాధనే మన లక్ష్యం కావాలి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఆత్మనిర్భరత సాధన కోసం ఏకతాటిపైకి రావాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన భారత్, ఆత్మనిర్భర్ భారత్ సాధనే మన లక్ష్యం కావాలని అన్నారు. దేశ గౌరవాన్ని దెబ్బతీసి, సమాజాన్ని విభజించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. భారతీయ సంస్కృతిని ద్వేషించే వారిని ఎదుర్కోవాలని అన్నారు. మాతృభూమిపై శత్రువులను గుర్తించి వారిని ఓడించేందుకు సంకల్పం తీసుకోవాలని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తూర్పు ఢిల్లీలో ఐపీ ఎక్స్‌టెన్షన్‌లోని ఉత్సవ్ మైదానంలో నిర్వహించిన దసరా వేడుకలు, రావణ దహనం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రకటించిన ‘రాముడి నుంచి రాష్ట్రం.. దైవం నుంచి దేశం’ సంకల్పాన్ని నెరవేరుస్తామని దేశ ప్రధాని స్పష్టం చేశారు. దేశమంతా రామమయం.. గ్రామగ్రామాన రామలీలలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పారు. విజయదశమి కేవలం పండుగ కాదని.. భారతదేశ ప్రాణశక్తి అని అభివర్ణించారు. రామలీలా మైదానంలో నిర్వహించే ప్రదర్శనలతో శ్రీరాముడి ఆదర్శాలను సజీవంగా ఉంచుతున్నామని తెలిపారు. దుష్టశక్తులు, దౌర్జన్యాల అంతానికి, అసత్యంపై సత్యం, అధర్మంపై ధర్మం సాధించే విజయానికి దసరా పండుగ ప్రతీక అని గుర్తు చేశారు.


వేల సంవత్సరాలుగా శ్రీరాముడిని ఆరాధిస్తున్న భారతీయ సంస్కృతి మనదని ఈ సందర్భంగా పీఎం మోదీ చెప్పారు. రావణ సంహారమే కాదు.. మానవాళికి శ్రీరాముడు ఆదర్శాలను అందించారని వివరించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సత్యం, ధర్మం, నీతి మార్గాన్ని శ్రీరాముడు వీడలేదని అన్నారు. రాజ్యాధికారం లభించినా, వనవాసం ఎదురైనా సమభావంతో ఆయన నిలిచారని చెప్పారు. నిషాదరాజును ఆలింగనం చేసుకుని, శబరి మాతను గౌరవించారని అన్నారు. దయ, కరుణ, ప్రేమ, సామరస్యాలకు శ్రీరాముడు నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు. సమానత్వం, న్యాయం, ప్రజా సంక్షేమానికి ప్రతీక రామరాజ్యమని పేర్కొన్నారు. పాలన అంటే అధికారం చెలాయించడం కాదని.. ప్రజల సంక్షేమమే లక్ష్యం కావాలని అన్నారు.


పేదలు, అణగారిన వర్గాల సేవకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ చెప్పారు. సంక్షోభం ఎంత పెద్దదైనా.. మన సామర్థ్యంపై మనకు నమ్మకం ఉండాలని పేర్కొన్నారు. ఇతరులపై ఆధారపడకుండా సొంత వనరులతో సమస్యలకు పరిష్కారం కనుగొనాలని తెలిపారు. సమష్టి కృషి, ప్రజల భాగస్వామ్యంతో అసాధ్యమైన లక్ష్యాలను సుసాధ్యం చేయవచ్చునని అన్నారు. ఆత్మవిశ్వాసం, అచంచల సంకల్పం విజయానికి మూల మంత్రాలని ప్రధాని మోదీ వివరించారు.


ప్రజాశక్తితో ప్రజా సంక్షేమం.. ప్రతి పౌరుడి ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రధాని మోదీ తెలిపారు. దేశ పురోగతికి ఆత్మగౌరవం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కీలకమని వ్యాఖ్యానించారు. విదేశాలకు తరలించిన ప్రాచీన కళాఖండాలను భారత్‌కు తిరిగి తీసుకొస్తున్నామని వివరించారు. గత 12 ఏళ్లలో 650కుపైగా ప్రాచీన విగ్రహాలను భారత్‌కు తిరిగి తీసుకొచ్చామని చెప్పారు. భారతీయ సాంస్కృతిక కేంద్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తున్నామని అన్నారు.


యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతీయ వారసత్వ సంపదకు గుర్తింపు పెరుగుతుందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. విజయదశమి మనలో ధైర్యాన్ని నింపే విజయ పర్వదినమని అన్నారు. సత్యం, మానవత్వం వైపు నిలిస్తే అంతిమ విజయం మనదేని తెలిపారు. జాతీయ ప్రయోజనాల కోసం ఐక్యంగా నిలవాలని వివిధ రంగాల్లోని సంస్థలు, రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆపరేషన్ కంప్లీటెడ్.. హ్యాండ్లర్లకు షూటర్ల మెసేజ్

అబద్ధాలు చెప్పి అలసిపోయి వియత్నాం వెళ్తున్నారు.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు..

Updated Date - Oct 20 , 2026 | 08:01 PM