ఆపరేషన్ కంప్లీటెడ్.. హ్యాండ్లర్లకు షూటర్ల మెసేజ్
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:53 PM
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఉదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ప్లాన్ ప్రకారం టైగర్‌పై కాల్పులు జరిపారని, ఆ ప్లాన్‌పై బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఎప్పటికపుడు సమన్వయం చేసుకున్నారని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఉదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ప్లాన్ ప్రకారం టైగర్‌పై కాల్పులు జరిపారని, ఆ ప్లాన్‌పై బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఎప్పటికపుడు సమన్వయం చేసుకున్నారని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. కాల్పులు జరిపే ముందు ముగ్గురు నిందితులు హృతిక్ అలియాస్ రోషన్ (22), రెహాన్ (18), ఫూల్ సింగ్ (18) తమ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉన్నారని, వారి నుంచి సూచనలు, అప్‌డేట్లు అందుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. టైగర్‌పై కాల్పులు జరిపి పారిపోయిన ఆ ముగ్గురిని రాజస్థాన్‌లోని కోటాలో పట్టుకున్న విషయం తెలిసిందే. తర్వాత రోడ్డు మార్గం ద్వారా వారిని ముంబైకు తీసుకువచ్చారు. ప్రస్తుతం నిందితులకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన తర్వాత నిందితులు బైక్‌పై పారిపోయారు. ‘ఆపరేషన్ పూర్తయింది’ అని షూటర్లు వారి హ్యాండ్లర్లకు సమాచారం ఇచ్చారని అధికార వర్గాలు వెల్లడించాయి. కాల్పులకు సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చే వరకూ అనిల్ పండిట్ అనే హ్యాండ్లర్, అతని సహాయకులు ఎదరుచూశారని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. వార్తలు మీడియాలో వచ్చాక కాల్పులకు పాల్పడిందే తామే అని ఫేస్‌బుక్ పోస్టు ద్వారా నిందితులు ప్రకటించారు. తర్వాత ఒక ఆడియో క్లిప్‌ను కూడా విడుదల చేశారు. టైగర్‌పై కాల్పుల కోసం నిందితులకు హ్యాండ్లర్లు అడ్వాన్సుగా రూ.50 వేలు ఇచ్చారని, కాల్పులు పూర్తయ్యాక అదనపు డబ్బు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. కాగా.. ఆదివారం సాయంత్రం టైగర్ ష్రాఫ్ ముంబైలోని జుహులో ఫుట్‌బాల్ ఆడిన తర్వాత కారులో వెళ్తుండగా దుండగులు అతనిపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ వార్తలూ చదవండి
ముంబై కుర్లాలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా 9 మందికి గాయాలు
వెయ్యిసార్లైనా కన్నడిగులకు క్షమాపణ చెబుతా.. పహల్గామ్ దాడితో పోలికపై సోనూ నిగమ్ సారీ..