ఢిల్లీలో రావణుడితో పాటు 30 అడుగుల కాక్రోచ్ దిష్టిబొమ్మ దహనం!
ABN , Publish Date - Oct 20 , 2026 | 01:37 PM
ఈసారి ఢిల్లీలో రావణుడితో పాటు కాక్రోచ్ దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు. ఇందుకోసం 30 అడుగుల కాక్రోచ్ దిష్టిబొమ్మను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: విజయదశమి రోజున రావణుడిని దహనం చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి ఢిల్లీలో రావణుడితో పాటు కాక్రోచ్ దిష్టిబొమ్మను కూడా దహనం చేయనున్నారు. ఇందుకోసం 30 అడుగుల కాక్రోచ్ దిష్టిబొమ్మను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. నేటి (మంగళవారం) సాయంత్రం రామ్లీలా మైదానంలో ఈ దహన కార్యక్రమం జరగనుంది. కేంద్రానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వరుస నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ కాక్రోచ్ దిష్టిబొమ్మ దహనం చర్చనీయాంశంగా మారింది. అయితే బొద్దింక మురికికి చిహ్నమని, అందుకే దాన్ని దహనం చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకానీ దీని వెనుక మరే రాజకీయ కారణాలూ లేవని అంటున్నారు. ‘స్వచ్ఛ భారత్’, ‘స్వచ్ఛ ఢిల్లీ’లో భాగంగా తాము ఈ పని చేయడానికి సిద్ధమయ్యామని వివరిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ కేశవ్ రామ్లీలా కమిటీ నిర్వహిస్తోంది. ఈ కమిటీ ప్రెసిడెంట్, బీజేపీ ఎమ్మెల్యే అశోక్ గోయెల్ మాట్లాడుతూ.. స్వచ్ఛత ముఖ్యమని చాటిచెప్పేందుకు మురికికి చిహ్నమైన బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేస్తున్నామని తెలిపారు. రావణుడి అసురుల సైన్యంలో బొద్దింక కూడా ఉందని పేర్కొన్నారు. కాగా ఈ వ్యవహారంపై పలు విమర్శలు వస్తున్నాయి. హిందూ సంప్రదాయాల్లోకి రాజకీయాలను తీసుకువస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
ఈ వార్తలూ చదవండి
ముంబై కుర్లాలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా 9 మందికి గాయాలు
వెయ్యిసార్లైనా కన్నడిగులకు క్షమాపణ చెబుతా.. పహల్గామ్ దాడితో పోలికపై సోనూ నిగమ్ సారీ..