నేతన్నకు పండగేదీ?!
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:37 AM
అందరికీ ఆనందాలు పంచే పండగ వేళ.. చేనేత కార్మికులు మాత్రం నిరాశానిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు.
జౌళిశాఖ పని కల్పించదు.. ఆర్డర్లు దక్కనివ్వదు!
దేవ దేవుడికి వస్త్రం నేసే ఆఫర్ వదులుకున్న దుస్థితి
‘నేతన్న సేవలో’.. ఆగస్టు నుంచీ వాయిదాలే
అధికారుల అవినీతితో అర్హులకు తిప్పలు
నలుగురిని సస్పెండ్ చేసినా మారని తీరు
దీపావళికైనా పింఛను ఇస్తారో లేదో..
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అందరికీ ఆనందాలు పంచే పండగ వేళ.. చేనేత కార్మికులు మాత్రం నిరాశానిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. అటు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు అందక, ఇటు నేసిన వస్ర్తాలకు మార్కెటింగ్ దక్కక నేతన్న కుటుంబాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నేతన్నలకు ఏదో చేయాలని అనుకొంటున్నా.. జౌళిశాఖ అలసత్వం, అధికారుల అవినీతి.. చేనేతల పాలిట శాపంగా మారాయి. ఏదో విధంగా కష్టపడి నేసిన వస్త్రాన్ని అయినా కొనుగోలు చేస్తారా.. అంటే ప్రైవేటు వ్యక్తులకు ఆర్డర్లు ఇవ్వడం తప్ప సంక్షేమ శాఖలకు నేతన్నలు కనిపించరు. ఆఖరికి కలియుగదైవం వేంకటేశ్వరుడు కరుణించినా.. ‘దేవ దేవుడికి వస్త్రం సరఫరా చేయాలా.. అబ్బే మా వల్ల కాదండి.. మీరు ప్రైవేటుకు ఇచ్చేయండి’ అంటూ వారితో కుమ్మక్కై మరీ వదులుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉన్న ‘నేతన్న సేవలో’ పెన్షన్ ఇచ్చేందుకు మూడు పండగలు ముగుస్తున్నా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. మీకు చేనేత పెన్షన్ ఇప్పిస్తాం అంటూ చేనేత జౌళిశాఖ ఎంపిక చేసేందుకు రూ.ఐదు వేల నుంచి పది వేల లంచం తీసుకుని నేతన్నను పీక్కు తిన్నారు. నలుగురు జిల్లా స్థాయి అధికారులను చేనేత జౌళిశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినా డబ్బులు ఇచ్చుకున్నోళ్లకు మాత్రం న్యాయం జరగలేదు. రాష్ట్రంలో అధికారికంగా లక్షన్నర మగ్గాలు ఉంటే అందులో సంక్షేమ పథకాలకు అర్హులైన వారు 90వేలకు పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న సంక్షేమ పథకాల్లో 72వేల మందికి చేనేత పెన్షన్ అందుతోంది. ఇంకా చాలా మంది అర్హులు ఉన్నారని వాళ్లందరికీ ఇస్తామని ఆగస్టు 7న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. సెప్టెంబరు 1 నుంచి పెన్షన్ ఇస్తామంటూ అధికారులు హడావుడిగా దరఖాస్తులకు స్వీకరించే ప్రక్రియ మెదలు పెట్టారు.
కొందరు అనర్హుల్ని రాజకీయ నేతలు మాస్టర్ వీవర్స్ వద్ద పనిచేస్తున్నట్లు చెప్పి సిఫారసు చేశారు. మరికొందరికి మగ్గం లేకపోయినా పెన్షన్ ఇప్పిస్తామంటూ అధికారులు ఐదు నుంచి పది వేల వరకూ లంచం తీసుకుని నేత కార్మికుడు అంటూ సర్టిఫై చేశారు. ఫలితంగా అన్ని జిల్లాల నుంచి 36వేల దరఖాస్తులు వచ్చాయి. అయినా అర్హులు చాలా మంది మిగిలే ఉన్నారని తెలియడంతో జౌళిశాఖ ఆరా తీసింది. పలు జిల్లాల్లో స్వయంగా చేనేత జౌళిశాఖ అధికారులే అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో కమిషనర్ రేఖారాణి నాలుగు జిల్లాల అధికారుల్ని సస్పెండ్ చేశారు. కానీ అక్టోబరు వస్తున్నా అర్హులైన నేతన్నలకు మాత్రం పెన్షన్ అందడం లేదు. సీఎం ప్రకటన చేశాక మాకు మొదటి పండగ ఆగస్టు 15, రెండో పండగ వినాయక చవితి, మూడో పండగ విజయదశమి అయిపోయాయి.. నాలుగో పండగ దీపావళి కూడా దగ్గర్లోనే ఉంది.. అప్పటికైనా ఇస్తారో లేదో.. ప్రతి పండగకూ ఎదురు చూడటమే తప్ప ఫలితం కనిపించడం లేదు’ అంటూ నేతన్నలు నిట్టూరుస్తున్నారు.
దేవ దేవుడికి వస్త్రం సరఫరా ‘గోవిందా’
తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రం సరఫరా ఆర్డర్ రాష్ట్ర చేనేత జౌళిశాఖకు లభించింది. ఆ ఆర్డర్ తెచ్చుకోవడానికి కమిషనర్ పలుమార్లు తిరుమలకు వెళ్లి అక్కడ తిష్టవేసి తాము సరఫరా చేస్తామంటూ సాధించుకున్నట్లు జౌళిశాఖ ప్రచారం చేసింది. మరోవైపు నేతన్నకు వెంకన్నవరాలు అంటూ ఆ శాఖ మంత్రి సవిత భారీ ప్రకటనలు ఇచ్చారు. చివరికి తాము వస్త్రం సరఫరా చేయలేమంటూ ఆర్డర్ వదులుకున్నారు. ఇదేంటని ఆరా తీస్తే కో ఆప్టెక్స్‌కు ఇప్పించి ప్రైవేటు వ్యాపారులకు మేలు చేకూర్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు ప్రతిఫలం కూడా పొందరని, నేతన్నకు పని కల్పిస్తే ఈ దుస్థితి ఎందుకు వస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భగవంతుడికే వస్త్రాలు సమకూర్చలేని రాష్ట్ర చేనేత జౌళిశాఖ నేతన్న సంక్షేమం ఎలా చూస్తుంది.. ప్రభుత్వ సంక్షేమ శాఖల ఆర్డర్లు ఎలా పొందగలుగుతుంది.. అనే పెదవి విరుపులు కూడా వినిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష
నేడు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు