Share News

వెయ్యిసార్లైనా కన్నడిగులకు క్షమాపణ చెబుతా.. పహల్గామ్ దాడితో పోలికపై సోనూ నిగమ్ సారీ..

ABN , Publish Date - Oct 20 , 2026 | 01:07 PM

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ మరోసారి కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు. గతంలో కన్నడ పాట పాడాలంటూ చేసిన విజ్ఞప్తిని పహల్గామ్ ఉగ్రదాడితో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

వెయ్యిసార్లైనా కన్నడిగులకు క్షమాపణ చెబుతా.. పహల్గామ్ దాడితో పోలికపై సోనూ నిగమ్ సారీ..
Sonu Nigam apology

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ మరోసారి కన్నడిగులకు క్షమాపణలు చెప్పారు. గతంలో కన్నడ పాట పాడాలంటూ చేసిన విజ్ఞప్తిని పహల్గామ్ ఉగ్రదాడితో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో అక్టోబర్ 24న జరగనున్న సంగీత కార్యక్రమానికి ముందు ఆయన మరోసారి కన్నడ ప్రజలకు క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. కన్నడిగులతో తనకున్న అనుబంధం దెబ్బతినకూడదని, వారి మనసులు నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు (Sonu Nigam apology).


2025 ఏప్రిల్‌లో బెంగళూరులోని ఈస్ట్ పాయింట్ కళాశాలలో జరిగిన సంగీత కార్యక్రమంలో ఈ వివాదం మొదలైంది. కార్యక్రమానికి హాజరైన కొందరు ప్రేక్షకులు, సోనూ నిగమ్‌ను కన్నడ పాట పాడాలని కోరారు. ఆ సమయంలో కొందరు యువకులు వ్యవహరించిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కన్నడ పాట పాడాలంటూ ఒత్తిడి చేయడాన్ని పహల్గామ్ ఉగ్రదాడితో పోలుస్తూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కర్ణాటకలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి (Sonu Nigam Kannada controversy).


కన్నడ భాషను, కన్నడిగుల మనోభావాలను అవమానించారని పలువురు ఆరోపించారు. ఆ తర్వాత సోనూ నిగమ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. కొందరు యువకులు దూకుడుగా వ్యవహరించడంతోనే తాను అలా మాట్లాడానని, తన ఉద్దేశం కన్నడిగులందరినీ కించపరచడం కాదని పేర్కొన్నారు. అయినప్పటికీ వివాదం కొనసాగింది. ఈ వివాదం నేపథ్యంలో సోనూ నిగమ్‌పై బెంగళూరులో ఫిర్యాదు నమోదైంది. అనంతరం ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు (Sonu Nigam Bengaluru concert).


అక్టోబర్ 24న బెంగళూరులో సోనూ నిగమ్ సంగీత కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వవద్దని పోలీసులను కర్ణాటక రక్షణ వేదిక కోరింది. గాయకుడి గత వ్యాఖ్యలు కన్నడిగులను బాధించాయని పేర్కొంటూ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోనూ నిగమ్ క్షమాపణలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన క్షమాపణల అనంతరం నిరసనను విరమించుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది.


ఇవి కూడా చదవండి..

త్వరలోనే పారిస్ ముస్లిం నగరంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 20 , 2026 | 01:07 PM