Share News

ఢిల్లీ ఐపీ ఎక్స్‌టెన్షన్‌లో దసరా వేడుకలకు హాజరుకానున్న మోదీ.!

ABN , Publish Date - Oct 20 , 2026 | 03:15 PM

తూర్పు ఢిల్లీలో ఐపీ ఎక్స్‌టెన్షన్‌లోని ఉత్సవ్ మైదానంలో మంగళవారం సాయంత్రం దసరా వేడుకలు, రావణ దహనం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఢిల్లీ ఐపీ ఎక్స్‌టెన్షన్‌లో దసరా వేడుకలకు హాజరుకానున్న మోదీ.!

ఇంటర్‌నెట్ డెస్క్: తూర్పు ఢిల్లీలో ఐపీ ఎక్స్‌టెన్షన్‌లోని ఉత్సవ్ మైదానంలో మంగళవారం సాయంత్రం దసరా వేడుకలు, రావణ దహనం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. వేదిక పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధించారు. భద్రత, ట్రాఫిక్ బాధ్యతలు చూడడానికి కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, ఢిల్లీ పోలీసులకు చెందిన సుమారు 2,500 మంది సిబ్బందిని మోహరించనున్నారు. వారిలో స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్(స్వాట్) విభాగానికి చెందిన కమాండోలు కూడా ఉన్నారు. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో లేదా కార్యక్రమ వేదిక వద్ద ఆందోళనలు నిర్వహించడం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉండడంతో ఈ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.


భద్రతా ఏర్పాట్లలో భాగంగా మొత్తం మూడు వలయాలను ఏర్పాటు చేయనున్నారు. లోపలి వలయంలో ప్రధాన మంత్రి భద్రతా బాధ్యతలను నిర్వహించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) సిబ్బంది ఉంటారు. మధ్య వలయంలో ఢిల్లీ పోలీసుల ప్రధాని భద్రతా విభాగానికి చెందిన సిబ్బంది, కమాండోలు ఉంటారు. బయటి వలయంలో స్థానిక ఢిల్లీ పోలీస్ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తారు. ఇక ఈ కార్యక్రమానికి 10 వేల మంది హాజరయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. మోదీ సాయంత్రం సుమారు 6:30 గంటలకు ఉత్సవ్ మైదానానికి చేరుకునే అవకాశం ఉంది. పాస్‌లు ఉన్నవారికే ప్రవేశం కల్పించనున్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు.


కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ఐపీ ఎక్స్‌టెన్షన్ మైదానంతో పాటు తమ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో జరిగే దసరా వేడుకల కోసం విస్తృతమైన భద్రత ఏర్పాట్లు చేశామని తూర్పు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మైదానం వద్ద భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు డ్రోన్లను కూడా వినియోగించనున్నామని ఆయన చెప్పారు. ఎలాంటి దాడులు జరగకుండా కీలక ప్రాంతాల్లోని భవనాల పైకప్పులపై ప్రత్యేక బృందాలను మోహరించనున్నామని తెలిపారు. కాగా.. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించేందుకు సుమారు 300 మంది ట్రాఫిక్ పోలీసు సిబ్బందిని నియమించారు.


ఈ వార్తలూ చదవండి

ముంబై కుర్లాలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా 9 మందికి గాయాలు

వెయ్యిసార్లైనా కన్నడిగులకు క్షమాపణ చెబుతా.. పహల్గామ్ దాడితో పోలికపై సోనూ నిగమ్ సారీ..

Updated Date - Oct 20 , 2026 | 03:42 PM