Share News

తృణమూల్‌లో అధిపత్య పోరు.. పార్టీపై పట్టు తనదేనన్న మమత

ABN , Publish Date - Jun 23 , 2026 | 01:50 PM

బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఎంసీలో అంతర్గత విభేదాలు ముదురుతున్న తరుణంలో మమతా బెనర్జీ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

తృణమూల్‌లో అధిపత్య పోరు.. పార్టీపై పట్టు తనదేనన్న మమత
Mamata Benarjee

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్‌(TMC)లో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్న తరుణంలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు పావులు కదుపుతున్నారు. తనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి అసమ్మతి వర్గం తొలగించిన మరుసటి రోజే కొత్త జాబితాను సిద్ధం చేశారు. నేషనల్ వర్కింగ్ కమిటీ‌ పేరిట రూపొందించిన ఈ లిస్ట్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.


ఈ జాబితాలో మమతనే అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్(ATMC) ఛైర్‌పర్సన్‌గా చేర్చారు. దీంతో పార్టీపై ఇంకా తనకే పూర్తి అధికారాలున్నాయన్న సంకేతాన్ని దీదీ పంపినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే సమయంలో రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం కోల్‌కతాలో సమావేశమై ప్రత్యామ్నాయ జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటుచేసింది. 30 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీయే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటించింది. ఇందులో అరూప్ రాయ్‌కు ఛైర్మన్‌ పదవి దక్కగా.. ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిశ్వాస్ వంటి వారికి కీలక బాధ్యతలు దక్కాయి.


ఇటీవలే కోల్‌కతా మేయర్ పదవికి రాజీనామా చేసిన ఫిర్హాద్ హకీమ్.. కొత్త ప్రభుత్వ పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. దీదీకి అత్యంత సన్నిహితులైన ఫిర్హాద్ హకీమ్, అరూప్ బిశ్వాస్ అసమ్మతి వర్గ సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుగుబాటు వర్గం సమావేశం అనంతరం రితబ్రత బెనర్జీ మాట్లాడుతూ.. ప్రత్యేక సమావేశంలో ప్రతినిధుల ఏకగ్రీవ నిర్ణయంతో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నామన్నారు. త్వరలో జిల్లా కమిటీలు, వాని అధ్యక్షుల వివరాలనూ ప్రకటిస్తామని తెలిపారు. అయితే.. దీదీని పూర్తిగా పక్కనపెట్టే ఉద్దేశం తమకు లేదని, పార్టీకి మార్గదర్శకురాలిగా ఆమెనే కొనసాగించాలనుకుంటున్నట్టు చెప్పారు.


ఇక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురు సీనియర్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది టీఎంసీ. నోటీసులు అందుకున్న వారిలో అరూప్ రాయ్, అరూప్ బిశ్వాస్, ఫిర్హాద్ హకీమ్, రతిన్ ఘోష్, జావేద్ ఖాన్, సబీనా యాస్మిన్ తదితరులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో టీఎంసీలో నెలకున్న అంతర్గత విభేదాలు మరింత ముదురగా.. ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై చర్చలు జోరందుకున్నాయి.


ఇవీ చదవండి:

'నీట్‌' రాష్ట్రంలో అసమానతల్ని సృష్టిస్తోంది: సీఎం విజయ్

కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం

Updated Date - Jun 23 , 2026 | 03:08 PM