కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం
ABN , Publish Date - Jun 23 , 2026 | 10:32 AM
కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ సీనియర్ నేత జార్జ్ కురియన్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహా మేరకు కురియన్ రాజీనామాను ఆమోదించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.
కేంద్ర మైనారిటీ వ్యవహారాలు, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖల్లో సహాయ మంత్రిగా సేవలందించిన కురియన్.. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు బీజేపీ తరఫున అవకాశం దక్కని సంగతి తెలిసిందే.
1960 సెప్టెంబర్ 20న కేరళలోని కొట్టాయం జిల్లాలో జన్మించిన కురియన్.. న్యాయ విద్యను అభ్యసించి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1980లో బీజేపీ ఆవిర్భావం నుంచే పార్టీతో అనుబంధం కొనసాగించిన ఆయన.. సుమారు 40ఏళ్లకు పైగా పార్టీలో ఉన్నారు. తన రాజకీయ జీవితంలో జాతీయ మైనారిటీల కమిషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు కురియన్. అలాగే కేంద్ర మాజీ మంత్రి ఓ.రాజగోపాల్‌కు ప్రత్యేక విధుల అధికారి(ఓఎస్‌డీ)గానూ సేవలందించారు. 2024 జూన్ 9న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జూన్ 11న బాధ్యతలు చేపట్టారు. బీజేపీలో సుదీర్ఘ అనుభవం కలిగిన నేతగా గుర్తింపు పొందిన కురియన్.. కేరళలో పార్టీ విస్తరణకు ప్రత్యేక కృషి చేశారు.
ఇవీ చదవండి:
లఖ్‌నవూ అగ్నిప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న బాధిత కుటుంబాల ఆవేదన..
ఒప్పందం ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డొనాల్డ్ ట్రంప్