Share News

లఖ్‌నవూ అగ్నిప్రమాదం.. ‘నాన్నా.. నన్ను కాపాడండి’ అంటూ..

ABN , Publish Date - Jun 23 , 2026 | 10:01 AM

ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖ్‌నవూ అలీగంజ్‌‌లో సోమవారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 13 మంది విద్యార్థులు సహా మెుత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాల ఆవేదన కన్నీరు పెట్టిస్తోంది.

లఖ్‌నవూ అగ్నిప్రమాదం.. ‘నాన్నా.. నన్ను కాపాడండి’ అంటూ..

ఉత్తర్ ప్రదేశ్: లఖ్‌నవూ అలీగంజ్‌ ప్రాంతంలో నిన్న (సోమవారం) భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 13 మంది విద్యార్థులు సహా మెుత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భవనంలోని మూడో అంతస్తులో యానిమేషన్‌ కోచింగ్‌ సెంటర్‌ ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ సెంటర్‌లో దాదాపు 30 మంది విద్యార్థులు ఉండగా.. వారిలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. కొంతమంది విద్యార్థులు ప్రాణభయంతో మెుదటి అంతస్తు నుంచి కిందకి దూకగా.. మిగతా వారిని పోలీసులు రక్షించారు. మరోవైపు, ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్‌ పాఠక్‌ ఆదేశించారు.


ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారిని కోల్పోయిన బాధలో వారు మాట్లాడిన మాటలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. తన కుమారుడిని గుర్తు చేసుకుంటూ ప్రభ్‌జోత్ సింగ్ అనే వ్యక్తి కన్నీటిపర్యంతం అయ్యారు. 'నా కుమారుడు సుఖ్మణి సింగ్ సోమవారం మధ్యాహ్నం సుమారు 2:15 గంటలకు ఫోన్ చేశాడు. నాన్నా మంటలు వ్యాపించాయి, దయచేసి నన్ను కాపాడండి అన్నాడు. కానీ మేము అతన్ని కాపాడలేకపోయాం' అని ఆవేదన వ్యక్తం చేశాడు. 'దాదాపు రెండున్నర గంటల పాటు భవనాన్ని దట్టమైన పొగ కమ్మేయడంతో మా కుమారుడు లోపలే చిక్కుకుపోయాడు. త్వరగా సహాయం అందుంటే అతను బతికే వాడు. స్థానికులు వీడియోలు తీయకుండా సహాయం చేసి ఉంటే కొంతమందైనా ప్రాణాలతో ఉండేవారు. బహుశా నా కుమారుడూ బతికి ఉండేవాడేమో' అని ఆదిత్య శ్రీవాస్తవ తల్లి పేర్కొన్నారు.


మరోవైపు అబ్దుల్ రెహమాన్ మరణంతో అతని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. రెహమాన్ అద్దె ఇంట్లో నివసించేవాడని అతని స్నేహితుడు సద్దాం షేక్ తెలిపారు. 'రెహమాన్ తండ్రి పక్షవాతంతో బాధపడుతున్నారు, తల్లి గృహిణి. కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి అతనే. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి?' అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఓ యువతి తన స్నేహితుడు ఆదిత్యని గుర్తు చేసుకుంది. 'ఆదిత్యకి చాలా మంచి భవిష్యత్తు ఉంది. గత వారమే అతన్ని కలవాలని అనుకున్నా. ఇంతలోనే ఆదిత్య ప్రాణాలు కోల్పోయాడు' అని విలపించింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఏఐ కారణంగా లేఆఫ్స్.. ఒరాకిల్ ధ్రువీకరణ

కోచింగ్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం..15మంది ఆహుతి

Updated Date - Jun 23 , 2026 | 10:42 AM