Share News

ఏఐ కారణంగా లేఆఫ్స్.. ఒరాకిల్ ధ్రువీకరణ

ABN , Publish Date - Jun 23 , 2026 | 09:52 AM

ఏఐ కేంద్రంగా తమ కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో లేఆఫ్స్ చేపట్టాల్సి వచ్చిందని టెక్ దిగ్గజం ఒరాకిల్ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది.

ఏఐ కారణంగా లేఆఫ్స్.. ఒరాకిల్ ధ్రువీకరణ
Oracle Layoffs

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ టెక్ దిగ్గజ సంస్థ ఒరాకిల్ ఇటీవల కాలంలో ఏఐ కేంద్రంగా తన కార్యక్రమాలను పునర్‌ వ్యవస్థీకరిస్తోంది. ఈ నేపథ్యంలో 2026 ఆర్థిక సంవత్సరంలో 21 వేల మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని ఒరాకిల్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. భవిష్యత్తులో మరిన్ని లేఆఫ్స్‌కు అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఏడాది కాలంలో తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 13 శాతం తగ్గిందని పేర్కొంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్య దాదాపు1.62 లక్షలు కాగా ఈ ఏడాది మే 31 నాటికి 1,41,000లకు పడిపోయింది.

సోమవారం ఒరాకిల్ తన వార్షిక నివేదికను విడుదల చేసింది. తమ కార్యకలాపాల్లో ఏఐ పాత్ర పెరగడంతో ఉద్యోగుల సంఖ్యలో కోత పడిందని చెప్పింది. మేనేజ్‌మెంట్, ఉత్పత్తుల్లో మార్పులు, పనితీరు సంబంధిత అంశాలు, వ్యూహాత్మక మార్పులు, ఇతర సంస్థల కొనుగోళ్లు వంటివి కూడా లేఆఫ్స్‌కు కారణమని తెలిపింది. వాస్తవానికి ఒరాకిల్‌లో కీలక మార్పులు రానున్నాయని సంస్థ మార్చిలోనే పేర్కొంది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణకు నిధుల కొరత ఏర్పడిన నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య తగ్గించే అవకాశం ఉందని వెల్లడించింది.


ఒకప్పుడు డేటాబేస్ సాఫ్ట్‌వేర్ సంస్థగా ఉన్న ఒరాకిల్ ఏఐ జమానాలో కీలక మార్పులకు లోనవుతోంది. సంస్థ చైర్మన్ లారీ ఎల్లిసన్ సారథ్యంలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో మేటి కంపెనీగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో సంస్థలో మునుపెన్నడూ లేని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఓపెన్ ఏఐ లాంటి సంస్థల ఏఐ వర్క్ లోడ్స్‌కు అవసరమైన స్థాయిలో భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.

ఈ రంగంలో ఇప్పటికే వేళ్లూనుకున్న అమెజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థల ఆధిపత్యానికి ఒరాకిల్ సవాలు విసిరేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మౌలిక వసతుల ఏర్పాటుకు కావాల్సని నిధుల కోసం రుణాలపై ఒరాకిల్ ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 70 బిలియన్ డాలర్ల క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్ ఉండవచ్చని సంస్థ అంచనా వేసింది. డెట్, ఈక్విటీల ద్వారా 40 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు సిద్ధమైంది. లేఆఫ్స్ నేపథ్యంలో ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీల కింద సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 1.84 బిలియన్ డాలర్లను చెల్లించింది.


ఈ వార్తలనూ చదవండి:

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..

చమురు కోసం భారత్‌ ‘సముద్ర మంథన్‌’

Updated Date - Jun 23 , 2026 | 10:21 AM