Share News

చమురు కోసం భారత్‌ ‘సముద్ర మంథన్‌’

ABN , Publish Date - Jun 23 , 2026 | 05:53 AM

దేశంలో చమురు వినియోగం ఏటికేటికీ పెరిగిపోతోంది. డిమాండ్‌కు తగ్గట్టు దేశీయ ఉత్పత్తి పెరగడం లేదు. ఫలితంగా దేశీయ అవసరాల్లో 85 శాతం ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం...

చమురు కోసం  భారత్‌ ‘సముద్ర మంథన్‌’

సముద్ర జలాల్లో భారీగా అన్వేషణకు సిద్ధం

గుదిబండలా మారిన క్రూడ్‌ దిగుమతులు

రూ.13.50 లక్షల కోట్లకు చేరిన దిగుమతి బిల్లు

న్యూఢిల్లీ: దేశంలో చమురు వినియోగం ఏటికేటికీ పెరిగిపోతోంది. డిమాండ్‌కు తగ్గట్టు దేశీయ ఉత్పత్తి పెరగడం లేదు. ఫలితంగా దేశీయ అవసరాల్లో 85 శాతం ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ వంటి పెట్రో ఉత్పత్తుల దిగుమతుల కోసం మన దేశం 14,270 కోట్ల డాలర్లు (సుమారు రూ.13.50 లక్షల కోట్లు) ఖర్చు చేయాల్సి వచ్చింది. మరో పాతికేళ్లలో ఈ బిల్లు 30,000 కోట్ల డాలర్లకు ఎగబాకే అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థ కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ అంచనా వేస్తోంది. దీంతో భారత ప్రభుత్వం సముద్ర మంథన్‌ పేరుతో దేశీయంగా చమురు, గ్యాస్‌ను ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రానున్న నెల రోజుల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

సరఫరా ఆటంకాలు

ఒకవైపు చమురు దిగుమతి బిల్లు పెరిగిపోతోంది. మరోవైపు ఎలాంటి అంతర్జాతీయ ఉద్రిక్తతలు లేదా సంక్షోభం ఏర్పడినా.. ఆ ప్రభావం చమురు దిగుమతులపై పడుతోంది. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో గత మూడు నెలలుగా హోర్ముజ్‌ జలసంధి మూసుకుపోయింది. దీంతో భారత్‌తో పాటు అనేక దేశాలకు చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. యుద్ధానికి ముందు బ్యారల్‌ 60-65 డాలర్ల మధ్య ట్రేడైన చమురు ధర ఒక దశలో 130 డాలర్లకు ఎగబాకింది. ప్రస్తుతం అమెరికా-ఇరాన్‌ శాంతి చర్చలతో కొద్దిగా ఉపశమించినా, ఇప్పటికీ చమురు ధర యుద్ధానికి ముందున్న ధర కంటే అధిక ధర వద్దే ట్రేడవుతోంది.

సముద్ర మధనమే

ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధన భద్రత ఎంత అవసరమో ప్రభుత్వానికి తెలిసి వచ్చింది. దీంతో ప్రైవేటు సంస్థలను కూడా ప్రోత్సహించటం ద్వారా దేశీయంగా చమురు ఉత్పత్తి పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 2030 నాటికి భారత తీర ప్రాంతంలోని దాదాపు 10 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోని సముద్ర జలాల్లో చమురు, గ్యాస్‌ నిక్షేపాలను కనుగొని ఉత్పత్తి ప్రారంభించాలని యోచిస్తోంది. దీనికి తోడు వెనెజువెలాతో పాటు అనేక దేశాల చమురు, గ్యాస్‌ క్షేత్రాల్లో ఈక్విటీ వాటా తీసుకునేందుకూ భారత కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇన్ని చేసినా మరో 20 సంవత్సరాల పాటు భారత్‌కు పెద్దఎత్తున చమురు, సహజ వాయువుల దిగుమతులు తప్పవని ఆర్థిక నిపుణుల అంచనా.


నిక్షేపాలు భారీగానే!

మన తీర ప్రాంతంలోని ముంబై హై, కేజీ బేసిన్‌లలో మినహా మిగతా సముద్ర ప్రాంతంలో చమురు, గ్యాస్‌ నిక్షేపాల కోసం పెద్దగా అన్వేషణ జరగలేదు. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల్లో ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి సంస్థలు మాత్రమే చమురు, గ్యాస్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం అండమాన్‌ సముద్రం, తూర్పు తీరంలో దాదాపు 2,200 కోట్ల బ్యారళ్ల చమురుకు సమానమైన చమురు, గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నాయి. అండమాన్‌ సముద్ర ప్రాంతంలో దాదాపు 37.1 కోట్ల టన్నులకు సమానమైన చమురు, గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నట్టు గత ఏడాది ప్రభుత్వ రంగంలోని ఆయిల్‌ ఇండియా (ఓఐఎల్‌) ప్రకటించింది. ఇవి కాకుండా మహానది, కేరళ, కొంకణ్‌ బేసిన్‌లోనూ పెద్ద మొత్తంలో చమురు, సహజ వాయువుల నిక్షేపాలు ఉండే అవకాశం ఉన్నట్టు అంచనా.

భారీగా నిధుల కేటాయింపు !

పశ్చిమాసియా లాంటి విపత్తుల నుంచి బయటపడేందుకు దేశీయంగా చమురు, గ్యాస్‌ ఉత్పత్తి భారీగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందు లో భాగంగా గత ఏడాది ఆగస్టులో ప్రధాని మోదీ ప్రకటించిన ‘సముద్ర మంథన్‌’ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊతం ఇవ్వబోతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం కింద దేశ తీర ప్రాంతంలోని లోతట్టు సముద్ర జలాల్లో చమురు, గ్యాస్‌ అన్వేషణ కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంతో పాటు ప్రైవేటు సంస్థలనూ ప్రోత్సహించాలని యోచిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి నెల రోజుల్లోగా ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించబోతున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి.

ఈ వార్తలనూ చదవండి:

బంగారం దిగుమతులు 70 శాతం డౌన్‌

బంగారం, వెండి భారీగా తగ్గాయ్‌

Updated Date - Jun 23 , 2026 | 05:53 AM