బంగారం, వెండి భారీగా తగ్గాయ్
ABN , Publish Date - Jun 11 , 2026 | 03:49 AM
దేశీయంగా విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కె ట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.4,300 తగ్గి రూ.1,48,860కి జారుకుంది. 22 క్యారెట్ల స్వచ్ఛత...
తులం పసిడి రూ.4,300 డౌన్
హైదరాబాద్ మార్కెట్లో రూ.లక్షన్నర దిగువకు ధర
వెండి రూ.10,000 పతనం.. రూ.2.60 లక్షలకు కిలో రేటు
హైదరాబాద్: దేశీయంగా విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కె ట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.4,300 తగ్గి రూ.1,48,860కి జారుకుంది. 22 క్యారెట్ల స్వచ్ఛత లోహం రేటు రూ.3,950 తగ్గుదలతో రూ.1,36,450 వద్దకు దిగివచ్చింది. కిలో వెండి ఏకంగా రూ.10,000 పతనమై రూ.2.60 లక్షలకు పడిపోయింది. అంతర్జాతీయ విపణిలో వీటి ధరలు అమాంతం తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ధర ఒక దశలో 90.53 డాలర్లు (2.13 శాతం) తగ్గి 4,168.99 డాలర్లకు పడిపోగా.. సిల్వర్ 2.24 శాతం క్షీణించి 63.87 డాలర్లకు జారుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలతో పాటు డాలర్ విలువ, యూఎస్ బాండ్ల రేట్లు పెరగడంతో విలువైన లోహాలకు డిమాండ్ తగ్గింది. అలాగే, అమెరికా మార్కెట్లో పెరుగుతున్న ధరలను కట్టడి చేసేందుకు అక్కడి సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వచ్చే ద్రవ్య పరపతి సమీక్షలో ప్రామాణిక వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు బులియన్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి. సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడం, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎ్‌ఫ) లోకి పెట్టుబడులు తగ్గడం కూడా పసిడి గిరాకీపై ప్రభావం చూపుతోంది.
ఫెడ్ రేట్లు పెరిగితే.. బంగారం మరింత కిందికి
ఈ ఏడాది మే నెలలో అమెరికాలో మార్కెట్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ఠ స్థాయి 4.2 శాతానికి ఎగబాకింది. దాంతో ఫెడ్ రేట్ల పెంపు అంచనాలకు మరింత బలం చేకూరింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చన్న ఆశలు కూడా ఆవిరయ్యాయి. దాంతో ముడి చమురు ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కన్పించడం లేదు. అంటే, ఇంధన షాక్‌తో అంతర్జాతీయంగా ధరలు మున్ముందు మరింత ఎగబాకే ప్రమాదం ఉంది. ధరలకు కళ్లెం వేసేందుకు ఫెడరల్ రిజర్వ్‌తో పాటు అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ప్రామాణిక వడ్డీ రేట్లను పెంచాల్సి రావచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా బంగారం, వడ్డీ రేట్లది విలోమ సంబంధం. అంటే, వడ్డీ రేట్లు తగ్గుతున్న సమయంలో బంగారం రేట్లు పెరుగుతూ పోతుంటాయి. వడ్డీ రేట్లు పెరిగే సమయంలో బంగారం ధర తగ్గుతూ వస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి రేట్లు మరింత తగ్గుముఖం పట్టవచ్చని బులియన్ ట్రేడర్లు భావిస్తున్నారు.
సెప్టెంబరు చివరి నాటికి రూ.1.30 లక్షల దిగువకు గోల్డ్?
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, సెప్టెంబరు చివరి నాటికి ఔన్స్ గోల్డ్ ధర మరో 20ు తగ్గి 3,500 డాలర్ల స్థాయికి పడిపోవచ్చని ఆర్థిక సేవల దిగ్గజం సిటీ గ్రూప్ అంచనా వేసింది. అం టే, దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర (పన్నులతో కలిపి) రూ.1.27 లక్షల స్థాయికి తగ్గే అవకాశాలున్నాయి.
ఇవి కూడా చదవండి..
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..
బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..