Share News

మమతకు కొత్త సవాల్.. టీఎంసీ పార్టీ కార్యాలయంపై రితబ్రత వర్గం పట్టు

ABN , Publish Date - Jul 03 , 2026 | 09:54 PM

తృణమూల్ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ముదురుతోంది. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు టీఎంసీ వర్గం కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం సహా తమదే అసలైన టీఎంసీ అని ఓ సమావేశం కూడా నిర్వహించింది.

మమతకు కొత్త సవాల్.. టీఎంసీ పార్టీ కార్యాలయంపై రితబ్రత వర్గం పట్టు

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో ఆధిపత్య పోరు మరింత ముదిరింది. ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. తమదే అసలైన టీఎంసీ అని ప్రకటిస్తూ ఓ సమావేశం కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రితబ్రతతో పాటు ఫిర్హాద్ హకీమ్, జావేద్ ఖాన్, సందీపన్ సాహా, అఖ్రూజమాన్ తదితరులు పాల్గొన్నారు. కార్యాలయ యాజమాన్య సంబంధిత ప్రక్రియనంతా అధికారికంగా పూర్తి చేశామన్న రితబ్రత వర్గం.. ఇకపై ఇదే తమ పార్టీ సంస్థాగత కార్యాలయమని ప్రకటించింది. ఈ సందర్భంగా అఖ్రూజమాన్ మాట్లాడుతూ.. 'మేమే అసలైన తృణమూల్ కాంగ్రెస్. ఈ కార్యాలయం పార్టీదే. దీనికి పార్టీ కార్యకర్తలతో భావోద్వేగ అనుబంధం ఉంది' అని చెప్పుకొచ్చారు.


కాగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రితబ్రత బెనర్జీ, మమతా బెనర్జీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ఇరు వర్గాలు ప్రకటిస్తూ పార్టీపై పూర్తిస్థాయి హక్కుల కోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రితబ్రత వర్గం.. పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉండగా.. రితబ్రత నాయకత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ సహా పలువురు ఎన్నికల కమిషనర్లను కలిశారు. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై తమ హక్కులను ఈ భేటీలో ప్రస్తావించారు. అయితే.. పార్టీ నుంచి బహిష్కృతమైన నాయకులకు తిరిగి అదే పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించే అధికారం లేదని దీదీ వర్గం ఈసీ ఎదుట అభ్యంతరం తెలిపింది. ఈ వివాదంపై ఈసీ స్పందిస్తూ.. సంస్థాగత ఎన్నికలు, పార్టీ నియంత్రిత వాదనలు, ఆధారాలను ఇరు వర్గాలు జులై 6 సాయంత్రం 5:30 గంటలలోపు సమర్పించాలని ఆదేశించింది. దీంతో టీఎంసీలో ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది.


ఇవీ చదవండి:

సింధు జలాలపై భారత్‌ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..

'మతపరమైన ఆచారాల ముసుగులో క్రిమినల్ నేరాలను సమర్థించలేం'

Updated Date - Jul 03 , 2026 | 09:54 PM