Share News

దేశంలోనే తొలిసారి.. ఈ-వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:58 PM

దేశంలోనే తొలిసారిగా ఈడీ ఈ-వేలం ద్వారా ఓ విమానాన్ని విక్రయించింది. జులై 1న ఆక్షన్ నిర్వహించగా రూ.3 కోట్లకు సదరు విమానం అమ్ముడుపోవడం విశేషం.

దేశంలోనే తొలిసారి.. ఈ-వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ
ED Sold the Aircraft in an Auction

ఇంటర్నెట్ డెస్క్: దేశంలోనే తొలిసారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకున్న ఓ విమానాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించింది. హైదరాబాద్ జోనల్ ఈడీ స్వాధీనం చేసుకున్న హాకర్‌(Hawker) 800A విమానాన్ని విక్రయించేందుకు ఈ నెల 1న ఎంఎస్‌టీసీ ద్వారా ఆక్షన్ నిర్వహించగా.. రూ.3 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.


హాకర్ 800A విమానం అనేది అంతకుముందు ఫాల్కన్ పోంజీ కేసు ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్‌కు చెందినది. అయితే అమర్‌దీప్ నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో రూ.792 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఈడీ తేల్చింది. దర్యాప్తులో భాగంగా ఈ విమానాన్ని గత మార్చి 7న ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత.. చట్టపరమైన ప్రక్రియ ద్వారా, పీఎంఎల్‌ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ అనుమతితో దీనిని ఈ-వేలంలో రూ.3 కోట్లకు విక్రయించారు. ఈ సొమ్మును బాధిత పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు అరెస్ట్ అవ్వగా, దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు ఈడీ తెలిపింది.

అయితే.. ఈడీ స్వాధీనం చేసుకున్న విమానాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో విక్రయించడం దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఆస్తుల విక్రయ ప్రక్రియలో పారదర్శకత, పోటీ వాతావరణం కల్పించడం సహా ప్రభుత్వ ఆదాయాన్ని మరింత పెంచే దిశగా ఈ విధానం ఉపయుక్తమవుతుందని అధికారులు భావిస్తున్నారు.


ఇవీ చదవండి:

అప్పులతో తెలంగాణను సర్వనాశనం చేశారు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

అప్పులపై దుష్ప్రచారం.. మంత్రి జూపల్లికి హరీశ్‌రావు లేఖ

Updated Date - Jul 03 , 2026 | 06:27 PM